వనపర్తి జిల్లాలో..ఆర్టీసీ సేవలు అంతంతే!

వనపర్తి జిల్లాలో..ఆర్టీసీ సేవలు అంతంతే!
  • మూడేండ్లలో కొత్తగా వచ్చిన బస్సులు మూడే

వనపర్తి, వెలుగు: జిల్లా ఏర్పడ్డాక వనపర్తి జిల్లా కేంద్రానికి వచ్చిపోయే ప్రజలకు రవాణా సౌకర్యం అంతగా పెరగలేదు. వనపర్తి ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా బస్సులు పెరగకపోవడంతో జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మూడేండ్లలో కేవలం మూడే బస్సులు కొత్తగా వచ్చాయి. ఉన్న బస్సులు సరిపోక దూర ప్రాంత ప్రయాణికులు తిప్పలు పడాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ప్రతి బస్సు ఆక్యుపెన్సీ నూరు శాతం ఉంటోంది. డిపోలో 110 బస్సులు మాత్రమే ఉన్నాయి.  

మారుమూల గ్రామాలకు బస్సుల్లేవ్..

జిల్లాలోని గోపాల్​పేట, రేవల్లి, ఖిల్లాగణపురం, పెద్దమందడి, కొత్తకోట, అమరచింత మండలాల్లోని మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. డయల్​ యువర్​ డీఎం కార్యక్రమంలో ప్రయాణికులు తమ గ్రామానికి బస్సు నడిపించాలని డిమాండ్​ చేస్తున్నా చూస్తాం.. చేస్తాం.. అంటున్నారే తప్పితే నడిపించడంలేదని ప్రజలు వాపోతున్నారు. 

ట్రిప్పులు ఎత్తేసిన్రు..

వనపర్తి జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్​ ట్రిప్పులను ఎత్తేశారు. వనపర్తి జిల్లాగా ఏర్పడక ముందు ఉన్న ట్రిప్పులను ఆ తరువాత ఎత్తేయడం గమనార్హం. వనపర్తి జిల్లా కేంద్రం అయ్యాక ఫ్లోటింగ్​ పాపులేషన్​ పెరిగింది. ఏ రాత్రయినా సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి బస్సులు లేక అవస్థలు పడుతున్నారు. గతంలో రాత్రి 12 గంటలకు వనపర్తి డిపో, ఒంటి గంటకు గద్వాల డిపో బస్సులు హైదరాబాద్​ వెళ్లేవి.  ప్రస్తుతం రాత్రి 11 దాటితే ఒక్క బస్​ ఉండడం లేదు. గతంలో తిరుపతి–హైదరాబాద్​ బస్​ నడిచేది. కర్నూల్ లో రాత్రి 10:30కు బయలుదేరి  వనపర్తికి 12 గంటలకు చేరుకునేది. ఈ బస్​ జిల్లా ప్రజలకు అనుకూలంగా ఉండేది. 

ఇక్కడి ప్రజలు హైదరాబాద్​తో సమానంగా కర్నూల్​లో వ్యాపార లావాదేవీలు జరుపుతారు. అక్కడ పనులు చూసుకుని ఏ రాత్రయినా వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రాత్రి 9 దాటితే బస్​ లేదు.  నేషనల్​ హైవేను టచ్​ చేసే కొత్తకోట, పెబ్బేరు, మహబూనగర్​ వైపు రాత్రి 9 దాటితే బస్సులు ఉండడం లేదు. ఆ సమయంలో ప్రయాణికులు ప్రైవేట్​ వెహికల్స్​ను ఆశ్రయిస్తున్నారు. లేదంటే తెల్లవారుజామున 4 గంటల వరకు బస్టాండ్​లోనే ఉండిపోవాల్సి వస్తోంది. ప్రధాన రూట్లలో రాత్రి వేళల్లో బస్సులు నడపాలని డయల్​ యువర్​ డీఎం కార్యక్రమంతో పాటు స్వయంగా కలిసీ కోరినా బస్సుల కొరత కారణంగా నడిపించని పరిస్థితి నెలకొంది.
 
ప్రపోజల్స్​ పంపించాం..


కొత్తగా మూడు ఎక్స్​ప్రెస్​ బస్సులు వచ్చాయి. ఇంకా 26 బస్సులు కావాలని ప్రపోజల్స్​ పంపాం. అవి రాగానే  దూర ప్రాంతాలకు బస్సులు పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటాం. 
- వేణుగోపాల్, డిపో మేనేజర్