- మున్సిపల్ ఎన్నికలకు అధిక సంఖ్యలో నామినేషన్లు
- కాంగ్రెస్ లో టికెట్ దక్కనివారు విత్‌డ్రా చేసుకునేలా యత్నాలు
- బీజేపీ, బీఆర్‌ఎస్‌లోనూ రెబల్స్ లేకుండా చర్యలు
కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగిసింది. ఈ నెల 3 వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తూ పలు వార్డుల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో రెబల్స్ సమస్య తలెత్తింది. బీ -ఫారం దక్కని వారిని బరిలో నుంచి తప్పించేందుకు పార్టీ నేతలు బుజ్జగింపులు, భవిష్యత్‌పై భరోసా కల్పించే ప్రయత్నాలు చేశారు. కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 92 వార్డులు ఉండగా, 1,005 నామినేషన్లు దాఖలయ్యాయి.
పరిశీలన అనంతరం 678 మంది వేసిన 709 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. ఒక వ్యక్తి ఒకే వార్డులో రెండు, మూడు నామినేషన్లు వేయగా, ఒక్క నామినేషన్‌కే అనుమతి ఇచ్చారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 285, బీజేపీ నుంచి 115, బీఆర్‌ఎస్ నుంచి 173 నామినేషన్లు ఉన్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
కామారెడ్డిలో పోటీ తీవ్రం..
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డులకు గాను 527 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఒకటి తిరస్కరణకు గురికాగా, 340 మందికి సంబంధించిన 341 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. కాంగ్రెస్ నుంచి 129 మంది, బీజేపీ నుంచి 58 మంది, బీఆర్ఎస్ నుంచి 83 మంది నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ లో టికెట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో పలు వార్డుల్లో ఇద్దరి నుంచి నలుగురు వరకు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గెలుపు అవకాశాలు, స్థానిక పరిస్థితులు, సర్వేలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. బీ-ఫారం దక్కని వారు నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేలా నేతలు చర్చలు జరుపుతున్నారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు ఇతర ముఖ్య నేతలు నేరుగా అభ్యర్థులతో మాట్లాడుతున్నారు. టికెట్ రాని వారికి నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు ఇస్తామని హామీ ఇస్తూ రెబల్స్ బెడదను నివారించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నాయకులు సహకరిస్తుండగా, మరికొందరు మాత్రం బరిలో నిలబడేందుకే పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో కూడా కొన్ని వార్డుల్లో ఒకరికిపైగా టికెట్ ఆశించే వారు ఉండటంతో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చర్చలు జరుపుతున్నారు. బీఆర్‌ఎస్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉండగా, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెబల్స్కు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
మిగతా మున్సిపాలిటీల్లో...
బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కూడా అధికార కాంగ్రెస్ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. బాన్సువాడలో 19 వార్డులకు గాను కాంగ్రెస్ తరఫున 98 మంది, బీఆర్ఎస్ నుంచి 40, బీజేపీ 22 మంది నామినేషన్లు వేశారు. ఎల్లారెడ్డిలో 12 వార్డులకు గాను కాంగ్రెస్ తరఫున 26, బీఆర్ఎస్ 24, బీజేపీ 14 నామినేషన్లు వచ్చాయి. బిచ్కుందలో 12 వార్డులకు గాను కాంగ్రెస్ తరఫున 32, బీఆర్ఎస్ 26, బీజేపీ 21 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆయా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తరఫున నామినేషన్లు వేసిన వారితో ఎమ్మెల్యేలు చర్చిస్తున్నారు. టికెట్ దక్కని వారిని పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు ఏ వార్డులో ఎంత మంది బరిలో ఉండనున్నారనేది తేలనుంది.
