- వనపర్తి మార్కెట్లో మూడు రోజుల కింద రూ.12,667 రికార్డు ధర
- ఆదివారం గరిష్ట ధర రూ.9,790
- నార్త్ ఇండియా మార్కెట్లోకి పల్లి రావడమే కారణం
వనపర్తి, వెలుగు: వనపర్తి మార్కెట్లో వేరుశనగ ధర అమాంతం పడిపోయింది. గత నెల 28న క్వింటాల్ రూ.12,667 ధర పలకగా, ఆదివారం రూ.9,790కు పడిపోయింది. నాలుగు రోజులుగా వేరుశనగ ధర తగ్గుతూ వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటాల్‌కు ఏకంగా రూ.2877 తక్కువ రేట్ రావడంతో అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్ మార్కెట్లోకి దిగుబడి రావడంతోనే..
వనపర్తి జిల్లాలో పండించే పల్లీకి అఫ్లాటాక్సిన్ అనే శిలీంద్రం లేకపోవడంతో ఇక్కడి వేరుశనగను విదేశాలకు ఎగుమతి చేస్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి పంటను కొనేందుకు పోటీ పడుతుంటారు. అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేస్తుంటారు. తాజాగా గుజరాత్‌లోని మార్కెట్లతో పాటు ఇతర మార్కెట్లలో వేరుశనగ దిగుబడి వస్తుండడంతో ఇక్కడి పల్లీకి డిమాండ్ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
కేంద్రం వేరుశనగ కనీస మద్దతు ధరను రూ.7263గా ప్రకటించగా, గత నెల 22 నుంచి వనపర్తి మార్కెట్లో వేరుశనగకు ధర పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో, కమీషన్ ఏజెంట్లు తమకు తెలిసిన రైతులతో మాట్లాడి మార్కెట్‌కు పంట తెప్పించారు.
విదేశాలకు ఎగుమతితో డిమాండ్..
అబ్రాడ్‌లో వేరుశనగతో పాలు, నూనె, కేక్ వంటి బై ప్రాడక్టులతో పాటు పలు తినుబండారాలను తయారు చేస్తున్నారు. అఫ్లాటాక్సిన్ వంటి శిలీంద్రం లేని పల్లీకి మంచి రేట్ పెట్టి కొనుగోలు చేస్తుండడంతో వనపర్తిలో పండే వేరుశనగను మంచి రేట్ పలుకుతోంది. ఇదే ఇక్కడి వ్యాపారులకు వరంగా మారుతోంది. రైతుల నుంచి సరుకు తెప్పించేందుకు ధరను పెంచేసి, ఆ తరువాత వివిధ కారణాలు చూపుతూ తక్కువ ధరకు కొంటున్నారనే విమర్శలున్నాయి.
జనవరిలో 25,587 క్వింటాళ్లు కొనుగోలు..
వనపర్తి వ్యవసాయ మార్కెట్‌కు జనవరిలో 25,587 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. వీటిలో అత్యధిక ధర రూ.12,667 కాగా, గత నెల 21న క్వింటాల్‌కు రూ.4,600 అత్యల్ప ధర పలికింది. మార్కెట్ యార్డ్ కు వచ్చిన వేరుశనగ రకాన్ని బట్టి వ్యాపారులు ధరలు పెట్టేలా చూస్తున్నామని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తున్నామని చెబుతున్నారు.
