- మాకే టికెట్ అంటే మాకే కావాలంటూ పోటీ
- రంగంలోకి ముఖ్యనేతలు
- బుజ్జగిస్తున్నా తగ్గకుండా బరిలో నిలుస్తున్న రెబల్స్
నల్గొండ, వెలుగు: నామినేషన్ ఉపసంహరణకు గడువు మరొక్క రోజే ఉండడంతో ప్రధాన పార్టీల్లో రెబల్స్ భయం వెంటాడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి ఒక్కో వార్డులో నలుగురు చొప్పున నామినేషన్స్ వేయడంతో ముఖ్య నాయకులు రెబల్స్ ను బుజ్జగించే పనిలో పడ్డారు. కొందరు ఉప సంహరణకు ససేమిరా అంటున్నారు. రెబల్స్ గా బరిలోకి ఉంటే గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలోనే ఎక్కువ
మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఆశావాహులు ఎక్కువగా నామినేషన్స్ వేశారు. సూర్యాపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీ ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 468 మంది, బీఆర్ఎస్ నుంచి 302 మంది, బీజేపీ నుంచి 161, ఇండిపెండెంట్లు 140 మంది నామినేషన్ వేశారు. నల్గొండ జిల్లాలో నల్గొండ కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 631 మంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి 474 మంది, బీజేపీ నుంచి 287 మంది, ఇండిపెండెంట్లు 234 మంది నామినేషన్లు వేశారు. వీటిలో సూర్యాపేటలో 176, కోదాడ 122, హుజూర్ నగర్ 92, నల్గొండ కార్పొరేషన్ 143, మిర్యాలగూడ 213, దేవరకొండలో 105 మంది పోటీలో ఉన్నారు.
రంగంలోకి ముఖ్యనేతలు
నామినేషన్ల ఉప సంహరణకు ఒక్కరోజే గడువు ఉండడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు చర్చలు జరుపుతుండగా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఆశవాహులను ఏ విధంగా బుజ్జగించాలో ఎమ్మెల్యేలకు సైతం అంతుచిక్కడం లేదు. నల్గొండ కార్పొరేషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే జాబితా ప్రకటించగా అసంతృప్తులతో చర్చలు జరిపి రెబల్స్ బెడద లేకుండా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. ఇక సూర్యాపేట మున్సిపాలిటీలో కొంతమంది అభ్యర్డుల జాబితా ప్రకటించడంతో టికెట్ రాని ఆశవాహులతో ఎంపీ రఘువీర్ రెడ్డి చర్చలు జరిపిన విఫలం అవడంతో ఆదివారం సూర్యాపేటకు వచ్చిన పరిశీలకులు విశ్వనాథం ముందు ఆందోళనకు దిగారు.
కోదాడ మున్సిపాలిటీ లో చైర్మన్ పదవికి ఎవరి పేరు ప్రకటించకపోవడంతో చైర్మన్ పదవి ఆశిస్తున్న నాయకులు తమ అనుచరులతో అన్ని వార్డులలో నామినేషన్లు వేయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సమక్షంలో వారి నామినేషన్ల ఉపసంహరణ కోసం చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క సూర్యాపేట మున్సిపాలిటీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రెబల్ అభ్యర్థులతో చర్చలు జరిపి నామినేషన్ విత్ డ్రా కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
టికెట్ కోసం ఆందోళన
గెలిచే వారికి కాదని గ్రూపు రాజకీయాలు చేసే వారికే టికెట్ ఇస్తున్నారని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ పరిశీలకుడు విశ్వనాధన్ ముందు 11 వార్డు రాయినిగూడెం కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. పార్టీ సర్వే లో గెలిచే , పార్టీ కోసం అహర్నిశలు పని చేసే వారిని కాదని ఓడిపోయే వ్యక్తులకు కౌన్సిలర్ టికెట్ కేటాయిస్తున్నారని ఎల్గురి ఇందిర వర్గీయులు నిరసన చేపట్టారు.
పార్టీ ఏ పిలుపిచ్చినా తాము పార్టీ కోసం పనిచేశామని ప్రస్తుతం తమకే గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ తమకు టికెట్ ఇవ్వకుండా ప్రజాబలం లేని వారికి టికెట్ ఇస్తున్నారని పరిశీలకుడికి మొర పెట్టుకున్నారు. టిక్కెట్లు ఇంకా ఎవ్వరికీ ఖరారు చేయలేదని ఆశావహుల జాబితా వడపోత కార్యక్రమం జరుగుతుందన్నారు.
పక్క పార్టీల వైపు చూపు
టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు రెబల్స్ లేదా పక్క పార్టీల వైపు చూస్తూ ఎలాగైనా బరిలో ఉంటామన్న ఉండేలా సంకేతాలు పంపిస్తున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ లో టికెట్ లను ప్రకటించకపోవడంతో ఉత్కంఠ నెలకొనగా టికెట్ కోసం నాయకుల చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు. టికెట్ రాని పక్షంలో మరో పార్టీ నుండి అయిన టికెట్ సంపాదించేలా ప్లాన్ చేస్తున్నారు. సూర్యాపేట టిఆర్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ తో కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఆశావహులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
అంతేకాకుండా ఎన్నికల ఖర్చు సైతం భరిస్తామన్న హామీ ఇవ్వడంతో టికెట్ రాని ఆరుగురు ఆశావహులతో పాటు మరికొంతమంది చర్చలు జరుపుతున్నారు. ఇక బీజేపీ పార్టీ సైతం టికెట్ రాని ఆశావహులను తమ పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తూ పోటీలో నిలుపుతున్నారు. ఉపసంహరణ గడువు దగ్గర పడుతున్న వేళ అసమ్మతి నాయకులను ఎలా బుజ్జగిస్తారో వేచి చూడాలి.
