- పోటీ నుంచి తప్పుకోవాలని కోరుతున్న నేతలు
- కొంత మంది దారికొస్తున్నారు., మరికొందరు లెక్క చేస్తలేరు
మహబూబాబాద్, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు పూర్తయ్యాయి. దీంతో ఉప సంహరణ కోసం బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా, మహబూబాబాద్, తొర్రూరు, కేసముద్రం, డోర్నకల్, మరిపెడల మున్సిపాల్టీల్లో ఆయా పార్టీల టిక్కెట్లు దక్కని అసమ్మతి నాయకులను దారిలోకి తెచ్చుకోవడం రాజకీయ పార్టీలనేతలకు పెద్ద సవాలుగా మారుతుంది. అసమ్మతి అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి అధికారిక అభ్యర్థుల గెలుపు అవకాశాలు దెబ్బతింటాయనే భయంతో పార్టీ అగ్రనేతలు 'బుజ్జగింపు మంత్రాలను'ప్రయోగిస్తున్నారు.
భవిష్యత్ రాజకీయ పదువుల పై హామీలు..
టిక్కెట్ దక్కని నాయకులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్, బీఆర్ఎస్ల నాయకులు హామీ ఇస్తున్నారు. అధికార పార్టీ నేతలు మార్కెట్ కమిటీ చైర్మన్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులు, కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇస్తామని నచ్చజెబుతున్నారు. పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇస్తున్నారు.
సీనియర్ నాయకుల రంగప్రవేశం..
కాంగ్రెస్లో స్థానిక నాయకులతో సమస్య సర్దుమణగకపోతే, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నారు. అసమ్మతి నేతలను నేరుగా పిలిపించుకుని మాట్లాడటం, వారి కష్టాన్ని పార్టీ గుర్తిస్తుందని భరోసా ఇవ్వడం చేస్తున్నారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే భవిష్యత్తు ఉండదని సూచిస్తున్నారు.
చివరగా హెచ్చరికలు చేస్తున్నారు..
బుజ్జగింపులకు లొంగకుండా మొండిగా నామినేషన్ వేసిన వారిపై పార్టీలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. నామినేషన్ ఉపసంహరణ గడువులోగా వెనక్కి తీసుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని, బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేస్తున్నారు. స్వయంగా పెద్ద నేతలు రంగంలోకి దిగడంతో ఎక్కువ మొత్తంలో అసమ్మతి నాయకులు విత్ డ్రాకు సిద్ధపడుతున్నారు. కొన్నిచోట్ల మాత్రం పోటీలో నిలుస్తామని ప్రకటిస్తున్నారు.
సమీకరణలు, సర్వే రిపోర్టులే ఆధారంగా..
టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో వివరించడానికి పార్టీలు ఇప్పుడు సర్వే రిపోర్టులను ఆయుధంగా వాడుకుంటున్నాయి. సర్వేలో వేరే అభ్యర్థికి సానుకూలత ఎక్కువగా ఉందని, అందుకే ఇవ్వాల్సి వచ్చిందనే గణాంకాలతో సహా వివరిస్తున్నారు. కులం, లోకల్ సమీకరణాల వల్ల టిక్కెట్ కేటాయింపు మార్చాల్సి వచ్చిందని నచ్చజెబుతున్నారు. కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం కోసం, నామినేషన్ కోసం కొంత ఖర్చు చేస్తే, వారిని శాంతింపజేయడానికి, వారు చేసిన ఖర్చును పార్టీ భరిస్తుందని, అధికారిక అభ్యర్థి నుంచి సహకారం అందేలా చూస్తామని హామీలు ఇస్తున్నారు.
