సింగరేణికి కేసీఆర్‌‌‌‌ చేసిందేమీ లేదు: వివేక్ వెంకటస్వామి

సింగరేణికి కేసీఆర్‌‌‌‌ చేసిందేమీ లేదు: వివేక్ వెంకటస్వామి

 

  • 23 వేల మంది ఉద్యోగులను తొలగించినా పట్టించుకోలె
  • స్థానికులకే సింగరేణి ఉద్యోగాలు ఇచ్చేందుకు జీవో ఇప్పించా
  • మందమర్రిలోని కేకే-5 బొగ్గు గని గేట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ వంశీకృష్ణ

కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌, వెలుగు : సింగరేణి అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ చేసిందేమీ లేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామి విమర్శించారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కే కే-5 గనిపై సోమవారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్‌‌‌‌మీటింగ్‌‌‌‌కు వివేక్‌‌‌‌ వెంకటస్వామి, ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్‌‌‌‌ వెంకటస్వామి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల ఇన్‌‌‌‌కం ట్యాక్స్‌‌‌‌ రద్దు, సొంతింటి కలను బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ వచ్చేనాటికి సింగరేణిలో 62 వేల మంది ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం 39 వేలకు తగ్గారన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో 23 వేల మంది ఉద్యోగులను తొలగించినా అప్పుడు మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్‌‌‌‌ ఏనాడూ మాట్లాడలేదన్నారు. కార్మికుడి కొడుకునని చెప్పుకుంటున్న ఆయన సింగరేణి కార్మికులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. సింగరేణిలో 80 శాతం కాంట్రాక్ట్‌‌‌‌ ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని ఒప్పించి జీవో సైతం తెప్పించానని గుర్తు చేశారు. కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు మందమర్రిలో సింగరేణి స్కిల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్‌‌‌‌  ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. కాకా వెంకటస్వామి పెన్షన్‌‌‌‌ స్కీంను అమలు చేశారని, కార్మికుల భద్రత కోసం లేబర్‌‌‌‌ యూనియన్‌‌‌‌ స్థాపించారని చెప్పారు. సింగరేణి కాంట్రాక్ట్‌‌‌‌ కార్మికులకు హైపవర్​ కమిటీ వేతనాలు అమలు చేయిస్తానని, సింగరేణి ఖాళీ స్థలాల్లో నిర్మించిన మిగిలిన ఇండ్లకు పట్టాలు ఇప్పిస్తానని హమీ ఇచ్చారు. కేసీఆర్‌‌‌‌కు వ్యతిరేకంగా పోరాడినప్పుడు పటాన్‌‌‌‌చెరులోని తమ ఫ్యాక్టరీని మూసివేయించారని ఆరోపించారు. బాల్క సుమన్, బోర్లకుంట వెంకటేశ్‌‌‌‌ నేత ఐదేళ్లుగా ఎంపీగా ఉండి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సర్వే ఆధారంగానే కాంగ్రెస్‌‌‌‌ హైకమాండ్‌‌‌‌ వంశీకృష్ణకు టికెట్‌‌‌‌ ఇచ్చిందని స్పష్టం చేశారు.

పదేండ్లలో కొత్తగా ఒక్క బొగ్గు బాయి తీసుకురాలే : గడ్డం వంశీకృష్ణ

పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ తెలంగాణను అప్పులపాలు చేసి ప్రజలపై ఆర్థికభారం మోపిందని ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. పదేళ్లలో కొత్తగా ఒక్క బొగ్గుబాయిని కూడా తీసుకురాలేదన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు అక్రమ దందాలు, భూకబ్జా, ఇసుక దందాలు చేస్తూ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు రూ.450 కోట్ల రుణాన్ని ఇప్పించి సంస్థతో పాటు లక్ష ఉద్యోగాలను కాపాడిన ఘనత కాకా వెంకటస్వామికే దక్కిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.25 వేల కోట్ల బకాయిలను చెల్లించేలా రాష్ట్ర సర్కార్‌‌‌‌ను కోరుతామన్నారు. సింగరేణిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా అవకాశం కల్పిస్తే కార్మిక సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థులు, యువకుల బలిదానాలు, సబ్బండవర్గాలు పోరాటాలు, కాంగ్రెస్​ ఎంపీల పాత్ర వల్లే తెలంగాణ ఏర్పటైందన్నారు. కాక వెంకటస్వామి స్ఫూర్తితోనే ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. 

బొగ్గు బ్లాక్‌‌‌‌ల ప్రైవేటీకరణకు అనుకూలంగా బీఆర్ఎస్​ ఓటు : జనక్‌‌‌‌ప్రసాద్‌‌‌‌

సింగరేణిలో కొత్త బొగ్గులు తెస్తామని, స్థానికులు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ తర్వాత మాట తప్పారని ఐఎన్‌‌‌‌టీయూసీ సెక్రటరీ జనరల్​బి.జనక్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ విమర్శించారు. సింగరేణి ప్రైవేటీకరణకు నరేంద్ర మోదీ, కేసీఆరే కారణమన్నారు. బొగ్గు బ్లాక్​ల ప్రైవేటీకరణకు అనుకూలంగా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీలు ఓటు వేశారన్నారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే బొగ్గు గనుల కోసం పోరాటం చేస్తారని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. సమావేశంలో ఐఎన్‌‌‌‌టీయూసీ కేంద్ర కమిటీ సీనియర్​ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కాంపెల్లి సమ్మయ్య, ఆర్గనైజింగ్​సెక్రటరీ రాంశెట్టి నరేందర్, మందమర్రి ఏరియా వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ దేవి భూమయ్య పాల్గొన్నారు.