
2038 నాటికి భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనున్నదని అకౌంటింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై) తన ఎకానమీ వాచ్ ఆగస్టు– 2025 నివేదికలో అంచనా వేసింది. ఈ అంచనాలను పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) పద్ధతి ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం భారతదేశం 14.2 ట్రిలియన్ డాలర్ల(పీపీపీ) జీడీపీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. మొదటి స్థానంలో చైనా (33.6 ట్రిలియన్ డాలర్లు), రెండో స్థానంలో అమెరికా (25.7 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి.
2030 నాటికి భారత జీడీపీ 20.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాని వాటాను 10 శాతానికి పెంచుతుంది. అదే సమయంలో అమెరికా జీడీపీ 28.9 ట్రిలియన్ డాలర్లతో 14 శాతం వాటాను కలిగి ఉంటుంది.
2038 నాటికి భారత జీడీపీ 34.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని, అమెరికాను అధిగమించి రెండో స్థానానికి చేరుకుంటుంది. ఈ అంచనా భారత్ సగటు వృద్ధి రేటు 6.5 శాతం, అమెరికా వృద్ధి రేటు 2.1 శాతం ఆధారంగా రూపొందించారు.
అకౌంటింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం భారతదేశం వేగవంతమైన వృద్ధికి కింద అంశాలు ప్రధానంగా దోహదపడతాయి.
అధిక సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ రేట్లు: అధిక సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తాయి.
యువ జనాభా: దేశంలోని యువ కార్మికుల సంఖ్య ఆర్థిక వృద్ధికి ఒక ముఖ్యమైన చోదకశక్తి.
స్థిరమైన ఆర్థిక పరిస్థితులు: దేశంలో స్థిరమైన ఆర్థిక విధానాలు, వృద్ధికి అనుకూలమైన వాతావారణాన్ని కల్పిస్తున్నాయి.
గ్రామీణ డిమాండ్: గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుదల, ప్రభుత్వ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, తగ్గుతున్న వడ్డీరేట్లు , నియంత్రిత ద్రవ్యోల్బణం వృద్ధికి ఊతమిస్తున్నాయి.
పీపీపీ పద్ధతి అంటే
పర్చేజింగ్ పవర్ పారిటీ(పీపీపీ) ప్రకారం ఒక నిర్దిష్ట వస్తువుల సమూహాన్ని కొనుగోలు చేయడానికి వివిధ దేశాల కరెన్సీలకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక బిగ్మ్యాక్ బర్గర్ కొనుగోలు చేయడానికి అమెరికా 5 డాలర్లు, భారతదేశంలో రూ.200 ఖర్చయితే , 1 డాలర్ = రూ.50 అని పీపీపీ రేటు లెక్కిస్తారు. సాధారణ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్లతో పోలిస్తే పీపీపీ పద్ధతిలో ఒక దేశంలోని వస్తువులు, సేవల వాస్తవ ధరలను పరిగణనలోకి తీసుకుంటారు.