ఈజ్‌‌ ఆఫ్‌‌ డూయింగ్‌‌ బిజినెస్‌‌ లిస్టులో ఇండియా ర్యాంక్‌‌ 63

ఈజ్‌‌ ఆఫ్‌‌ డూయింగ్‌‌ బిజినెస్‌‌ లిస్టులో ఇండియా ర్యాంక్‌‌ 63

గత ఏడాదితో పోలిస్తే 14 స్థానాలు పైకి

వాషింగ్టన్‌‌:  వరల్డ్‌‌ బ్యాంక్‌‌ ప్రకటించిన ఈజ్‌‌ ఆఫ్‌‌ డూయింగ్‌‌ బిజినెస్‌‌ ర్యాంకుల్లో ఇండియా స్థానం మెరుగుపడింది. గత ఏడాది 190 దేశాలకు ర్యాంకింగులు ఇవ్వగా ఇండియా 77వ స్థానంలో నిలిచింది. ఈసారి 14 స్థానాలు పైకి లేచి 63వ ర్యాంకు సంపాదించుకుంది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న ఈ సమయంలో వరల్డ్‌‌ బ్యాంక్‌‌ ర్యాంకింగ్స్‌‌లో ఎదగడం ఇండియాకు కొంత ఊరట కలిగించేదే. వ్యాపారపరంగా అత్యంత పురోగతి సాధించిన ‘టాప్‌‌–10’ దేశాల్లోనూ వరుసగా మూడో ఏడాదీ మనదేశం  స్థానం సంపాదించుకోవడం విశేషం.

దివాలా చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం వల్లే ఈజ్‌‌ ఆఫ్‌‌ డూయింగ్‌‌ బిజినెస్‌‌ ర్యాంకుల్లో ఇండియా స్థానం మరింత మెరుగుపడిందని వరల్డ్‌‌బ్యాంక్‌‌ ప్రకటించింది. ఇది వరకటి మాదిరే న్యూజిలాండ్‌‌ మొదటిస్థానంలో నిలిచింది. సింగపూర్‌‌, హాంగ్‌‌కాంగ్‌‌లకు రెండు, మూడు ర్యాంకులు వచ్చాయి. దక్షిణ కొరియా ఐదోస్థానంలో నిలవగా, అమెరికాకు ఆరో ర్యాంకు దక్కింది. వరల్డ్‌‌బ్యాంకుతోపాటు ఆర్బీఐ, ఐఎంఎఫ్‌‌ ఇండియా జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించిన నేపథ్యంలో ఈ ర్యాంకులు వెల్లడయ్యాయి. ‘‘ఈజ్‌‌ ఆఫ్‌‌ డూయింగ్‌‌ బిజినెస్‌‌ 2020’’ పేరుతో విడుదల చేసిన రిపోర్టులో వరల్డ్‌‌బ్యాంకు ఇండియా ఆర్థిక, పారిశ్రామిక విధానాల్లో తీసుకొచ్చిన మార్పులను మెచ్చుకుంది. ‘‘వరుసగా మూడోసారి కూడా ఇండియా టాప్‌‌–10లో నిలిచింది. కొన్ని దేశాలు మాత్రమే గత 20 ఏళ్లలో ఈ లిస్టులో చోటు సంపాదించుకున్నాయి’’ అని వరల్డ్‌‌బ్యాంక్‌‌ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ సైమన్‌‌ డిజంకోవ్‌‌ అన్నారు. ఇదిలా ఉంటే, చైనా (31), బహ్రెయిన్‌‌ (43), సౌదీ అరేబియా (62), జోర్డాన్‌‌ (75), కువైట్‌‌ (83), టోగో (97), తజికిస్థాన్‌‌ (106), పాకిస్థాన్‌‌ (108), నైజీరియా (131)లోనూ వ్యాపారాల పురోగతి బాగవుతుందని ఈ రిపోర్టు పేర్కొంది.

మేకిన్‌‌ ఇండియాకు ప్రశంసలు

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫారిన్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్లను ఆకర్షించడానికి, ప్రైవేటు సెక్టార్‌‌ను ప్రోత్సహించడానికి ‘మేకిన్‌‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని ఈ రిపోర్టు ప్రస్తావించింది. రాబోయే ఏడాది ఇండియా ‘టాప్‌‌ 50’ ఎకానమీ దేశాల్లో ఒకటిగా నిలుస్తుందని సైమన్‌‌ అన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తదుపరి దశ సంస్కరణలను అమలు చేయాలి. పన్నుల చెల్లింపు,   దివాలా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఇండియా ప్రధానంగా దృష్టి సారించిందని వరల్డ్‌‌బ్యాంక్‌‌ పేర్కొంది. దివాలా చట్టం తేవడం వల్ల ఇన్వెస్టర్ల సమస్యలు పరిష్కారమయ్యాయని, ఇండియా ర్యాంకు పెరగడానికి ఇది ప్రధాన కారణమని బ్యాంకు తెలి మరో ఆఫీసర్‌‌ అన్నారు.