
హాంగ్జౌ (చైనా): వచ్చే ఏడాది జరిగే హాకీ వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించే గొప్ప అవకాశాన్ని ఇండియా విమెన్స్ జట్టు చేజార్చుకుంది. ఆదివారం ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో ఇండియా 1–4 చైనా చేతిలో కంగుతిన్నది. నవ్నీత్ కౌర్ (1వ ని) ఇండియా తరఫున ఏకైక గోల్ చేయగా, జియా యు (21వ ని), హంగ్ లీ (41వ ని), మైరాంగ్ జోయు (51వ ని), జియాకి జాంగ్ (53వ ని) చైనాకు గోల్స్ అందించారు. ఆరంభంలో దూకుడుగా ఆడిన ఇండియాకు 39వ సెకన్‌లోనే గోల్ చేసే చాన్స్ వచ్చింది. పెనాల్టీ కార్నర్‌ను నవ్నీత్ గోల్‌గా మలిచింది.
మూడు నిమిషాల తర్వాత చైనాకు వరుసగా పెనాల్టీలు లభించినా సద్వినియోగం చేసుకోలేదు. తొలి నిమిషంలోనే ఇండియా గోల్ కొట్టడంతో అప్రత్తమైన చైనా అటాకింగ్ గేమ్‌తో పాటు డిఫెన్సివ్ పద్ధతిని ఫాలో అయ్యింది. ఈ క్రమంలో ఓ సెట్ ప్లేయర్లు ఇండియా గోల్ పోస్ట్‌పై పదేపదే దాడులు చేయగా, మరో సెట్ పెనాల్టీ కార్నర్లపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఓ ఫీల్డ్ గోల్‌తో స్కోరును సమం చేసింది. రెండో హాఫ్ మరింత అగ్రెసివ్‌గా ఆడిన చైనీయులు వరుసగా అవకాశాలను సృష్టించుకున్నారు. ఫలితంగా13 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ కొట్టి ఆధిక్యాన్ని పెంచుకున్నారు. తర్వాత స్కోరును సమం చేసేందుకు ఇండియా ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. చైనాకు ఇది మూడో ఆసియా కప్ కావడం విశేషం. గతంలో హాంకాంగ్ (1989), బ్యాంకాక్ (2009)లో టైటిల్స్ గెలిచింది.