WTC Final : సగం స్కోర్ కూడా కొట్టలే.. సగం వికెట్లు డౌన్

WTC Final :  సగం స్కోర్ కూడా  కొట్టలే.. సగం వికెట్లు డౌన్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో సగం వికెట్లు కోల్పోయింది.  రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండిమా 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో అజింక్య రహానె(29), కేఎపస్ భరత్  (5)పరుగులతో ఉన్నారు.  ఇంకా టీమిండియా పరుగులు 318 వెనుకబడి ఉంది. 

ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులకు ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియాకు బిగినింగ్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు  కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‌మన్‌ గిల్ (13) త్వరగానే  ఔటయ్యారు. ఆ తరువాత వచ్చిన  చెతేశ్వర్‌ పుజారా (14)  కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో లేడు. దీంతో  50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది.  ఇక ఆదుకుంటాడనుకున్న విరాట్ కోహ్లీ (14) కూడా త్వరగానే పెవిలియన్‌ బాట పట్టాడు.  

అనంతరం రహానె, జడేజా టీమ్ ను నడిపించారు. మరో వికెట్ పడకుండా ఆడుతూ జట్టు స్కోర్ పెంచారు. అయితే దూకుడుగా ఆడుతూ అర్ధ శతకానికి చేరువైన రవీంద్ర జడేజా (48) ఔటయ్యాడు. నాథన్ లైయన్ వేసిన ఓవర్లో స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 142 పరుగులకే టీమిండియా ఐదో వికెట్లు  కోల్పోయి కష్టాల్లో పడింది.  

అంతకుముందు  ఓవర్‌ నైట్‌ స్కోరు 327/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ 469 పరుగులకు ఆలౌటైంది.  భారత్ బౌలర్లు పుంజుకోవడంతో మరో 142 పరుగులు జోడించి ఆసీస్‌ మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది.ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ లలో ట్రావిస్ హెడ్ (163), స్మిత్ (121) పరుగుల చేశారు.  వీరికి తోడు  అలెక్స్ క్యారీ(48), వార్నర్ (43) పరుగులు చేశారు.  

టీమిండియా బౌలర్లలో సిరాజ్‌ 4 వికెట్లు తీయగా షమీ, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు. జడేజాకు ఒక వికెట్ దక్కింది.