IOCని వెనక్కి నెట్టిన అంబానీ సంస్థ

IOCని వెనక్కి నెట్టిన అంబానీ సంస్థ
  •  2019లో రూ.6.23 లక్షల టర్నోవర్‌‌‌‌

మనదేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్‌‌‌‌ అంబానీకి చెందిన రిలయన్స్‌‌‌‌ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు అతిపెద్ద కంపెనీగా పేరున్న ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ (ఐఓసీ)ను రిలయన్స్‌‌‌‌ వెనక్కినెట్టింది. ఆదాయంపరంగా నెంబర్‌‌‌‌వన్‌‌‌‌ స్థానంలోకి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌‌‌‌ టర్నోవర్‌‌‌‌ రూ.6.23 లక్షల కోట్లకు చేరింది. ఐఓసీ టర్నోవర్‌‌‌‌ రూ.6.17 లక్షల కోట్లుగా నమోదయింది. 2019 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌‌‌‌ అత్యంత లాభం ఆర్జించిన కంపెనీగానూ రికార్డు సాధించింది. ఇది ఐఓసీ కంటే దాదాపు రెట్టింపు నికరలాభం సంపాదించింది. దశాబ్దం క్రితం వరకు రిలయన్స్‌‌‌‌ ఆదాయపరంగా ఐఓసీలో సగం ఉండేది. క్రమంగా కంపెనీకి కస్టమర్లు భారీ గా పెరగడం, టెలికం, డిజిటల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ వంటి కొత్త రంగాల్లోకి అడుగుపెట్టడంతో పెద్ద ఎత్తున విస్తరించింది. గత సంవత్సరంలో రూ.39,588 కోట్ల లాభం వచ్చింది. ఐఓసీ మాత్రం కేవలం రూ.17,274 కోట్ల లాభంతో సరిపెట్టుకుంది.

ఓఎన్‌‌‌‌జీసీ దూకుడు..

గత ఏడాది వరకు ఐఓసీ అత్యంత లాభదాయక పీఎస్‌‌‌‌యూగా పేరుండేది. మరో ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్‌‌‌‌జీసీ దీనికంటే అధికంగా లాభాలు సంపాదించింది. 2019 ఆర్థిక సంవత్సరం ఫలితాలను ఓఎన్‌‌‌‌జీసీ ఇంకా విడుదల చేయనప్పటికీ, తొలి తొమ్మిది నెలల్లోనే దీని లాభం రూ.22,189 కోట్లకు చేరింది. రిలయన్స్‌‌‌‌ 2017–18 ఆర్థిక సంవత్సరంలోనూ రూ.34,988 కోట్ల లాభం సంపాదించింది. ఇదే ఏడాదిలో ఓఎన్‌‌‌‌జీసీ రూ.19,945 కోట్లు సంపాదించింది. ఐఓసీ లాభం కంటే ఇది తక్కువ. 2019 ఆర్థిక సంవత్సరంలో అత్యంత భారీగా లాభాలు ఆర్జించడం ద్వారా రిలయన్స్‌‌‌‌.. రాబడి, లాభం, మార్కెట్‌‌‌‌ క్యాపిటలైజేషన్‌‌‌‌పరంగా నెంబర్‌‌‌‌వన్‌‌‌‌ స్థానానికి చేరింది. మంగళవారం దీని షేరు ధర రూ.1,345కి చేరడంతో మార్కెట్‌‌‌‌క్యాప్‌‌‌‌ రూ.8.52 లక్షల కోట్లకు పెరిగింది. మరో విశేషమేమంటే 2019లో ఈ కంపెనీ దగ్గర ఏకంగా రూ.1.33 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.