పైపాడు పోలింగ్ బూత్​లో గందరగోళం

పైపాడు పోలింగ్ బూత్​లో గందరగోళం
  •     ఈవీఎంపై ఉన్న కారు గుర్తుపై 
  •     స్కెచ్ తో గీసిన గుర్తుతెలియని వ్యక్తి
  •     30 ఓట్లు పోలయ్యాక గుర్తించిన ఆఫీసర్లు  
  •     ఆలంపూర్​లోని వడ్డేపల్లి పరిధిలో ఘటన  

గద్వాల,/ శాంతినగర్, వెలుగు: ఆలంపూర్​ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పైపాడు వార్డులో ఉన్న 167వ పోలింగ్​కేంద్రంలో సోమవారం గందరగోళం చోటుచేసుకుంది. ఆర్ వో  నరసింహులు కథనం ప్రకారం...పైపాడు వార్డులోని 167 పోలింగ్​కేంద్రంలో మొత్తం 1196 ఓట్లున్నాయి. మధ్యాహ్నం వరకు పోలింగ్​సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఓ గుర్తుతెలియని వ్యక్తి ఈవీఎంపై ఉన్న కారు గుర్తుపై స్కెచ్ పెన్ తో గీసి కనిపించకుండా చేశాడు. తర్వాత ఓటింగ్ కు వచ్చిన ఒకరు చూసి చెప్పడంతో ఆఫీసర్లు కారు గుర్తుపై ఉన్న మరకలు తొలగించి మళ్లీ ఓటింగ్ కొనసాగించారు.

మరక అంటించిన తర్వాత 30 ఓట్లు మాత్రమే పోలయ్యాయని, ఇందులో ఎవరికి నష్టం జరగలేదన్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రితిరాజ్ అక్కడికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు పర్యవేక్షించారు. ఎవరు మార్క్ చేశారనేది తెలుసుకోవడానికి కలెక్టర్ సంతోష్ సీసీ కెమెరాలు చెక్​ చేశారు. కారకుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.