బిల్డింగ్​ పర్మిషన్​ కావాలంటే.. కారు, బండికి చార్జింగ్​ స్టేషన్​ ఉండాల్సిందే..

బిల్డింగ్​ పర్మిషన్​ కావాలంటే.. కారు, బండికి చార్జింగ్​ స్టేషన్​ ఉండాల్సిందే..
  • ప్రభుత్వానికి ఫిక్కీ సిఫార్సు

న్యూఢిల్లీ:   ఎలక్ట్రిక్​ వెహికల్స్​ ఎకోసిస్టమ్​ను బలోపేతం చేయడానికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) కొన్ని ప్రత్యేక సిఫార్సులు చేసింది. ఇది భారతదేశం అంతటా ఉన్న 16,271 చార్జింగ్ స్టేషన్లను రెట్టింపు చేయడానికి ప్రభుత్వ–-ప్రైవేట్ భాగస్వామ్యాలు (పీపీపీ) అవసరమని స్పష్టం చేసింది. ఫిక్కీ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కమిటీ ఈవీ చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు చేసే హౌసింగ్ సొసైటీలకు మాత్రమే మున్సిపల్ కమిటీలు భవన నిర్మాణ అనుమతిని మంజూరు చేయాలని స్పష్టం చేసింది.  

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు), ఈవీ తయారీదారులు  ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పనిచేస్తున్న కంపెనీలు,  కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మధ్య సమన్వయంతో స్టేషన్లను ఏర్పాటు చేయాలి. హైవేలు, షాపింగ్ మాల్స్ వంటి పబ్లిక్ స్థలాలు  హౌసింగ్ సొసైటీల్లో చార్జింగ్ స్టేషన్లను అభివృద్ధి చేయాలి. చార్జింగ్ స్టేషన్లను అందించే హౌసింగ్ సొసైటీలకు మాత్రమే భవన నిర్మాణ అనుమతులు మంజూరు ఇచ్చే విధానాన్ని దేశవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు అనుసరించాలని సూచించామని ఫిక్కీ ఈవీ కమిటీ చైర్ సులజ్జ ఫిరోదియా మోత్వానీ అన్నారు.

హౌసింగ్ సొసైటీలకు చార్జింగ్ పాయింట్లు అవసరం

 రియల్టీ రంగం రెసిడెన్షియల్ సొసైటీలలో పాయింట్లను అమర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఫిక్కీ పేర్కొంది. ఈవీ చార్జింగ్ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌లో విద్యుత్ మంత్రిత్వ శాఖ,  ఇతర ప్రైవేట్ వాటాదారుల వల్ల  అన్ని రకాల ఎలక్ట్రిక్​ వాహనాలకు చార్జింగ్ సౌకర్యాలు పెరుగుతాయి.  ఈ విషయమై మోత్వానీ మాట్లాడుతూ ఇప్పుడు టైర్-2,  టైర్-3 నగరాల్లో కూడా  మరిన్ని ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లు అవసరమని అన్నారు.  

ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లతోపాటు అధునాతన బ్యాటరీ సాంకేతికత, స్మార్ట్​ చార్జింగ్ పథకాలు, బైడైరెక్షనల్​ చార్జింగ్​ సామర్థ్యాలు కావాలంటే లిథియం ఆయాన్, ఇతర ఖనిజాల కోసం అన్వేషణ వేగంగా జరగాలని అన్నారు. ఈవీ మౌలిక సదుపాయాలను పెంచడానికి కేంద్రం ఎలక్ట్రిక్​ మొబిలిటీ ప్రమోషన్​ స్కీమ్​ను మొదలుపెట్టింది. చార్జింగ్​ స్టేషన్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించింది. ఫేమ్​పథకాల కింద కేంద్రం దేశమంతటా చార్జింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది.  మనదేశంలో ప్రస్తుతం అత్యధికంగా మహారాష్ట్ర 3,079 స్టేషన్‌‌‌‌‌‌‌‌లతో అగ్రస్థానంలో ఉంది. 1,886 చార్జింగ్ స్టేషన్లతో  ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది.   కర్ణాటకలో 1, 041 స్టేషన్లు,  తమిళనాడులో 643 స్టేషన్లు ఉన్నాయి.