కస్టమర్లకు 1600 సిరీస్ నంబర్ల నుంచే ఇన్సూరెన్స్ కాల్స్.. మోసాల కట్టడికి TRAI ఆదేశాలు

కస్టమర్లకు 1600 సిరీస్ నంబర్ల నుంచే ఇన్సూరెన్స్ కాల్స్.. మోసాల కట్టడికి TRAI ఆదేశాలు

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) వినియోగదారుల భద్రత కోసం మరో కీలక అడుగు వేసింది. ఫోన్ కాల్స్ ద్వారా జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు.. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఒక ప్రత్యేక నంబర్ సిరీస్‌ను కేటాయించింది ట్రాయ్. అందువల్ల ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే ముఖ్యమైన సర్వీస్ కాల్స్ లేదా లావాదేవీల వివరాల కోసం '1600' నంబరుతో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్లను మాత్రమే ఉపయోగించాలని ట్రాయ్ దేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్పును అమలుకు ఫిబ్రవరి 15, 2026 వరకు గడువు ఇచ్చింది. 

ఈ నిర్ణయానికి గల కారణాలను పరిశీలిస్తే.. వినియోగదారులు తమకు వచ్చే కాల్ అసలైన ఇన్సూరెన్స్ కంపెనీ నుండే వస్తుందా లేదా స్కామర్ల నుంచి వస్తుందా అని సులభంగా ప్రజలు గుర్తించవచ్చు.10 అంకెల సాధారణ నంబర్ల ద్వారా బ్యాంక్ లేదా ఇన్సూరెన్స్ అధికారులమని చెప్పి మోసం చేసే వారి ఆటలు ఇకపై సాగవు. ప్రమోషన్ కాల్స్, ముఖ్యమైన సర్వీస్ కాల్స్ కు మధ్య తేడాను ప్రజలు సులభంగా అర్థం చేసుకోవటానికి కొత్త రూల్స్ సహాయంగా నిలవనున్నాయి.

ఎవరెవరు ఈ సిరీస్‌ను ఉపయోగిస్తారు? 
కేవలం దేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీలే కాకుండా.. ఇప్పటికే RBI పరిధిలోని బ్యాంకులు, SEBI (స్టాక్ మార్కెట్), PFRDA పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థలు కూడా ఈ '1600' సిరీస్‌ను వాడుతున్నాయి. ప్రభుత్వ సంస్థలకు కూడా ఇదే సిరీస్ కేటాయించబడింది. ఇప్పటివరకు దాదాపు 570 సంస్థలు ఈ సిరీస్‌లో 3 వేల కంటే ఎక్కువ నంబర్లను తీసుకున్నాయి. ప్రస్తుతం సదరు సంస్థలు ఈ నంబర్ల ద్వారానే తమ సేవలను అందిస్తున్నాయి. ఇది ప్రజల్లో నమ్మకాన్ని పెంచటంతో పాటు గందరగోళాన్ని తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఫోన్ కాల్స్ ద్వారా ఆర్థిక మోసాలు పెరుగుతున్న తరుణంలో.. ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు రక్షణ కవచంలా పనిచేయనుంది. 2026 ఫిబ్రవరి 15 తర్వాత.. మీకు ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ వస్తే.. అది '1600' తో మొదలవుతుందో లేదో ఒక్కసారి చూసుకోవడం మర్చిపోకండి. మోసగాళ్ల వలలో చిక్కకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు కొత్తగా వచ్చిన మార్పులను అర్థం చేసుకుని అప్రమత్తంగా ఉండండి.