ప్రమాదాల తర్వాత వాటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో ఉండే సమస్యలు, ఇబ్బందులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కారు లేదా బైక్ ప్రమాదానికి గురైనప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం సర్వేయర్ ఎప్పుడు వస్తాడా అని గంటల తరబడి నిరీక్షించాల్సిన పని ఇకపై ఉండదు. ఎందుకంటే రూ.50వేల లోపు విలువ గల మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో రిజిస్టర్డ్ సర్వేయర్ తనిఖీ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇవ్వటం వాహనదారులకు పెద్ద ఊరటను అందిస్తోంది.
'ప్రొటెక్షన్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ ఇంటరెస్ట్, 2024' మాస్టర్ సర్క్యులర్ ప్రకారం.. తక్కువ మొత్తంలో ఉండే క్లెయిమ్‌ల కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. మాన్యువల్ సర్వేకు బదులుగా యాప్-ఆధారిత మెథడాలజీ, ఏఐ ఆధారిత అసెస్‌మెంట్ ద్వారా నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా పారదర్శకత కూడా పెరుగుతోందని చెప్పారు.
నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
IRDAI నిబంధనల ప్రకారం సర్వే నియమాలు ఇలా ఉన్నాయి:
* మోటార్ ఇన్సూరెన్స్‌లో రూ. 50వేలు దాటిన నష్టాలకు, ఇతర ఇన్సూరెన్స్‌లలో రూ.లక్ష దాటిన నష్టాలకు మాత్రమే రిజిస్టర్డ్ సర్వేయర్ తనిఖీ తప్పనిసరి.
* క్లెయిమ్ రిపోర్ట్ చేసిన 24 గంటల్లోపు సర్వేయర్‌ను కేటాయించాలి ఇన్సూరెన్స్ కంపెనీలు.
* సర్వేయర్ తన నివేదికను 15 రోజుల్లోపు సమర్పించాలి. ఒకవేళ ఆలస్యమైతే.. క్లెయిమ్ రైజ్ చేసిన వాహనదారుడికి రోజుకు రూ.500 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా సర్వేయర్లు క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. 2023-24లో మొత్తం ఫిర్యాదుల్లో మోటార్ ఇన్సూరెన్స్ వాటా 26.18% ఉండగా, 2024-25 నాటికి అది 24.8%కి స్వల్పంగా తగ్గింది. గత మూడేళ్లలో ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్‌కు అందిన 10,156 ఫిర్యాదుల్లో ఇప్పటికే 9,943 పరిష్కరించబడ్డాయని మంత్రి తన సమాధానంలో వెల్లడించారు.
సర్వేయర్లు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా వారి లైసెన్స్‌లను రద్దు చేసే అధికారం IRDAIకి ఉంది. గడిచిన మూడేళ్లలో తనిఖీల ఆధారంగా 53 మంది సర్వేయర్లకు హెచ్చరికలు, అడ్వైజరీలను జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. పాలసీదారుల ప్రయోజనాలే లక్ష్యంగా కంపెనీలు పారదర్శకమైన క్లెయిమ్ విధానాలను అనుసరించాలని ఐఆర్డీఏఐ ఇప్పటికే ఆదేశించింది. దీనివల్ల సామాన్య వాహనదారులకు చిన్న చిన్న ప్రమాదాల సమయంలో క్లెయిమ్ సెటిల్మెంట్ సులభతరం అవనుంది.
