సైనికుడే గుండెచప్పుడు..అంతిమయాత్రకు ఊరూవాడ కదిలింది

సైనికుడే గుండెచప్పుడు..అంతిమయాత్రకు ఊరూవాడ కదిలింది

సరిహద్దులో గస్తీ కాసే సైనికుడే ఇపుడు దేశపు గుండె చప్పుడుగా మారింది. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన 40 సీఆర్పీఎఫ్ జవాన్ల చుట్టూనే దేశప్రజల ఆలోచనలు తిరిగాయి. మనుషులు ఎక్కడో ఉన్నా… వాళ్ల మనసులు మాత్రం అమరజవాన్ల త్యాగం గురించే ఆలోచించింది. దేశ రక్షణలో ప్రాణాలొదిలిన సైనికుల అంతిమయాత్రలో పాల్గొనేందుకు ఆయా రాష్ట్రాల్లో ఊరూవాడా కదిలింది. కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు.. సామాన్య జనం… కులం, వర్గం, మతంతో సంబంధం లేకుండా… వీర జవాన్లకు లాస్ట్ సెల్యూట్ చేసింది. కన్నీళ్లతో వారి త్యాగానికి నివాళులు అర్పించింది భారతావని.

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్ అంతిమయాత్రలో కేంద్రమంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ పాల్గొన్నారు.

జమ్ము కశ్మీర్ లోని రాజౌరీలో సీఆర్పీఎఫ్ జవాన్ నజీర్ అహ్మద్ అంతిమయాత్రలో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పాల్గొన్నారు.

బిహార్ లోని రతన్ పూర్, భగల్ పూర్ లలో జవాన్ రతన్ కుమార్ ఠాకూర్ అంతిమయాత్రకు జనం పెద్దసంఖ్యలో వచ్చారు. “సైన్యంలోకి పంపడానికి నా రెండో కొడుకును పంపుతా. కానీ.. పాకిస్థాన్ కు మాత్రం గట్టిగా బదులు చెప్పాలి” అని రతన్ కుమార్ ఠాకూర్ తండ్రి చెప్పాడు. ఆయన అన్న మాటలకు దేశమంతటినీ కదిలించాయి.

బిహార్ లోని పాట్నాలో హెడ్ కానిస్టేబుల్ సంజయ్ కుమార్ సిన్హా అంతిమయాత్రలో జనం భారీసంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలన ప్రదర్శించారు.

తమిళనాడులోని తిరుచ్చిలో కానిస్టేబుల్ శివచంద్రన్ అంత్యక్రియల్లో రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తోపాటు.. భారీగా జనం పాల్గొన్నారు. పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, నాయకులతోపాటు.. ప్రజలు స్వచ్చందంగా అమరవీరుల అంతిమయాత్రలో పాల్గొని నివాళులు  అర్పించారు.