- కరెంట్ సప్లయ్‌లో సమస్యలు పరిష్కరించాలని సూచన
- బడ్జెట్‌తో పాలసీ సపోర్ట్ దొరికింది
- రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడి
న్యూ ఢిల్లీ: ఇండియాలో డేటా సెంటర్లు వేగంగా విస్తరిస్తున్నాయి. గూగుల్, రిలయన్స్, అదానీ వంటి పెద్ద కంపెనీలు కూడా ఈ సెక్టార్‌లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చాక డేటా సెంటర్లకు డిమాండ్ మరింత పెరిగింది. గ్లోబల్‌గా ఇంటర్నెట్ డేటా వినియోగంలో 20 శాతం ఇండియా నుంచి ఉంటుండగా, డేటా సెంటర్లలో మన వాటా 5 శాతం కంటే తక్కువ ఉంది. దీంతో మరిన్ని డేటా సెంటర్లు ఏర్పాటయ్యే అవకాశం ఉందని కన్సల్టింగ్ కంపెనీ డెలాయిట్ అంచనా వేస్తోంది. కానీ, ఎలక్ట్రిసిటీ, గ్రిడ్ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపింది. ఇంటర్నెట్ వాడకం వేగంగా పెరుగుతున్న వేళ, డేటా సెంటర్లను మెయింటైన్ చేయడానికి రెన్యూవబుల్ ఎనర్జీపై ఆధారపడాలని వివరించింది. ఇండియా ఏఐ సమిట్‌లో డెలాయిట్ సౌత్ ఏషియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ దేబాశిష్ మిశ్రా తాజా రిపోర్ట్ వివరాలను పంచుకున్నారు. ‘‘ప్రపంచంలోనే టాప్ డేటా సెంటర్ హబ్‌లలో ఒకటిగా ఎదగడానికి భారత్‌కు అరుదైన అవకాశం ఉంది. ఇక్కడ కన్‌స్ట్రక్షన్, భూమి ఖర్చులు తక్కువ. పవర్ టారిఫ్స్ ఎక్కువగా లేవు. ఏఐ స్కిల్స్ ఉన్న వర్క్‌ఫోర్స్ అందుబాటులో ఉంది. డేటా సెంటర్ హబ్‌గా ఎదగడంలో ఇండియాకు ఇవి సాయపడతాయి. బడ్జెట్‌తో పాలసీ సపోర్ట్ లభించింది”అని మిశ్రా తెలిపారు. కాగా, ఇండియా నుంచి గ్లోబల్ క్లౌడ్ సర్వీసెస్ అందించే ఫారిన్ కంపెనీలకు 2047 వరకు టాక్స్ హాలిడే, డేటా సెంటర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ప్రిఫరెన్షియల్ ట్యాక్స్ ట్రీట్‌మెంట్‌ను బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
సమస్యలు పరిష్కరించాలి..
డేటా సెంటర్ల ఏర్పాటు కావాలంటే ఎలక్ట్రిసిటీ సమస్యలను పరిష్కరించాలి. ఏఐ వాడకం పెరగడంతో కరెంట్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. డెలాయిట్ రిపోర్ట్ ప్రకారం, ఏఐ ఆధారిత డేటా సెంటర్లకు 2030 నాటికి అదనంగా 40-–45 టెరావాట్ పవర్ కావాలి. 2024లో ఇది 10–-15 టెరావాట్స్ కరెంట్ డిమాండ్ మాత్రమే ఉండేది. నేషనల్ ఎలక్ట్రిసిటీ వినియోగంలో డేటా సెంటర్ సెక్టార్ వాటా 0.8శాతం నుంచి 2.5-3 శాతానికి పెరుగుతుందని అంచనా. భారత్‌లో ఎలక్ట్రిసిటీ ఖర్చు తక్కువగా ఉన్నా, గ్రిడ్లను ఆధునికరీంచినా ప్రొడక్షన్, ట్రాన్స్‌మిషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించకపోతే సప్లై గ్యాప్ ఏర్పడుతుంది. అంతేకాకుండా డేటా సెంటర్ల కోసం ప్రత్యేకంగా, అంతరాయం లేని పవర్ సప్లయ్ అవసరం. కానీ స్టేట్స్ మధ్య రెన్యూవబుల్ బ్యాంకింగ్ రూల్స్, ఓపెన్ యాక్సెస్ చార్జీలు, క్రాస్ -సబ్సిడీలు, టారిప్స్ వేరుగా ఉండడం వల్ల డెవలపర్లు ఇబ్బంది పడుతున్నారు. ‘‘మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి మేజర్ హబ్‌లలో 2030 నాటికి 2-3 గిగావాట్ చొప్పున అదనపు పీక్ డిమాండ్ ఏర్పడుతుంది. ప్రస్తుత పీక్ లోడ్‌లో ఇది 5–-20శాతానికి సమానం. స్టేట్ గ్రిడ్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది”అని డెలాయిట్ వివరించింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ వర్క్‌లోడ్ ఉన్న ఏఐ డేటా సెంటర్లకు కరెంట్ సప్లయ్ చేసేందుకు సోలార్, -విండ్, హైబ్రిడ్ మోడల్స్‌తో పాటు స్టోరేజ్ సొల్యూషన్స్‌తో కూడిన రెన్యూవబుల్ కరెంట్‌ను సప్లయ్ చేయాలని, లాంగ్-టర్మ్ గ్రీన్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ (పీపీఏలను) కుదుర్చుకోవాలని, కంపెనీలు లేదా కన్సార్టియం కలిసి కరెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది.
25 శాతం పెట్టుబడులు ఇండియాకే
డెలాయిట్ రిపోర్ట్ ప్రకారం, 2030 నాటికి ఆసియా పసిఫిక్‌లోని డేటా సెంటర్ సెక్టార్‌లోకి 800 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.73 లక్షల కోట్ల) పెట్టుబడులు వస్తాయి. గ్లోబల్ కెపాసిటీలో ఈ రీజియన్ వాటా 40 శాతానికి పెరుగుతుంది. నార్త్ అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ అవుతుంది. ఈ పెట్టుబడుల్లో 25 శాతం ఇండియాకు వస్తాయని అంచనా. అంటే ఇంకో ఐదేళ్లలో దాదాపు రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులను ఇండియా డేటా సెంటర్ సెక్టార్ ఆకర్షించే అవకాశం ఉంది. 2025లో భారత్ డేటా సెంటర్ కెపాసిటీ 2025లో 1.5 గిగావాట్స్ ఉండగా, 2030 నాటికి 8-–10 గిగావాట్స్‌కి పెరుగుతుంది.
