- గతేడాదితో పోలిస్తే 8 స్థానాలు కిందకు
- 76వ స్థానంలో చైనా, 133వ స్థానంలో పాక్
- అతి తక్కువ అవినీతి ఉన్న దేశంగా డెన్మార్క్‌కు మొదటి ర్యాంక్
- అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియాకు లాస్ట్ ర్యాంక్
ముంబై: ప్రపంచ అవినీతి ఇండెక్స్ విడుదలైంది. ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ 2023 సంవత్సరానికి సంబంధించి 180 దేశాలకు ర్యాంకులిచ్చింది. ఈ లిస్ట్ లో ఇండియా 39 స్కోర్ తో 93వ ర్యాంకులో నిలిచింది. గతేడాది 40 స్కోర్ సాధించిన భారత్ 85వ ర్యాంకు కైవసం చేసుకుంది. గతేడాదితో పోలిస్తే ఇండియా ర్యాంకు 8 స్థానాలు దిగజారి మాల్దీవులు, కజకిస్తాన్, లెసెతో వంటి అవినీతి దేశాల సరసన నిలిచింది.
ఈ ఇండెక్స్ లో సున్న స్కోరును అవినీతిమయ దేశంగా, 100 స్కోరును అవినీతి రహిత దేశంగా పరిగణిస్తారు. ఈ లిస్ట్ లో 90 స్కోర్ తో డెన్మార్క్ మొదటి స్థానాన్ని సాధించింది. ఆ తర్వాతి స్థానాలను ఫిన్ లాండ్, న్యూజిలాండ్, నార్వే, సింగపూర్ దక్కించుకున్నాయి. అట్టడుగున సోమాలియా 11 స్కోరుతో 180వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ర్యాంకులను వెనిజులా, సిరియా, సౌత్ సూడాన్, యెమెన్ దక్కించుకున్నాయి. ఈ లిస్ట్ లో చైనా .. ఇండియా కంటే మెరుగైన ర్యాంకును సాధించింది. 76వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో పాకిస్తాన్ 133వ స్థానంలో నిలిచింది.
