ఏంది బాస్.. మళ్లీ కరోనా వస్తుందా.. వరసగా రెండో రోజూ 3 వేలు దాటిన కేసులు

ఏంది బాస్.. మళ్లీ కరోనా వస్తుందా.. వరసగా రెండో రోజూ 3 వేలు దాటిన కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. ఒకటీ అరా కాకుండా.. వేల సంఖ్యలో రోజువారీ కేసులు నమోదు కావటం కలకలం రేపుతోంది. మార్చి 29వ తేదీ 3 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మార్చి 30వ తేదీ కూడా అదే స్థాయిలో 3 వేల 100 కొత్త కేసులు నమోదు కావటంతో భయాందోళనలకు దారి తీస్తోంది. గడిచిన 24 గంటల్లో.. అనగా మార్చి 30వ తేదీన ఒక వెయ్యి 390 మంది కోలుకున్నట్లు వెల్లడించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. 

మార్చి నాలుగో వారం ప్రారంభంలో 2 వేలుగా ఉన్న సంఖ్య.. చివరి నాటికి 3 వేలకు చేరటంతో వైద్య శాఖ అప్రమత్తం అయ్యింది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకపోగా.. క్రమంగా పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తుంది. రాష్ట్రాల వారీగా.. ప్రాంతాల వారీగా తీసుకుంటే ఢిల్లీలో అత్యధికంగా 295 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు చనిపోయారు.

ఢిల్లీ నాలుగు రోజులుగా ప్రతి రోజూ 250 కేసులకు తగ్గకుండా నమోదు అవుతుండటంతో సీఎం కేజ్రీవాల్ సైతం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి.. ఢిల్లీ కరోనా కేసుల పెరుగుదలపై సమీక్షించారు. వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు కేజ్రీవాల్.

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులతో.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది అక్కడ ప్రభుత్వం. దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులతో జనంలోనూ ఆందోళన నెలకొంది. ఏంటి బాస్.. మళ్లీ కరోనా వస్తుందా ఏంటీ అనే చర్చ జరుగుతుంది.