IND VS PAK: టీమిండియా బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన పాకిస్తాన్

IND VS PAK: టీమిండియా బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన పాకిస్తాన్

ఆసియా కప్ లో పాకిస్థాన్ పై టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. మంగళవారం (సెప్టెంబర్ 14) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. స్పిన్నర్ కుల్దీప్ మ్యాజిక్ తో పాటు మిగిలిన బౌలర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. 40 పరుగులు చేసిన ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకోగా.. పాండ్య, వరుణ్ చక్రవర్తిలకు చెరో వికెట్ దక్కింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సైమ్ అయూబ్ తొలి బంతికే హార్దిక్ పాండ్య బౌలింగ్ లో డకౌటయ్యాడు. ఆ తర్వాత రెండో ఓవర్లో బుమ్రా మహమ్మద్ హరీస్ ను పెవిలియన్ కు పంపాడు. 6 పరుగులకే రెండు వికెట్లు పడడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. వికెట్ కాపాడుకునే క్రమంలో ఫఖర్ జమాన్, ఫర్హాన్ స్లో గా బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లే తర్వాత ఒక్కసారిగా పాక్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఫఖర్ జమాన్ తో పాటు సల్మాన్ అలీ అఘా నాలుగు పరుగుల వ్యవధిలో ఔటయ్యారు. 

అసలే కష్టాల్లో ఉన్న పాక్ జట్టుకు కుల్దీప్ యాదవ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 13 ఓవర్లో హసన్ నవాజ్, మహమ్మద్ నవాజ్ లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. దీంతో పాకిస్థాన్ 64 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో లోయర్ ఆర్డర్ లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది జట్టును ఆదుకున్నాడు. కేవలం 16 బంతుల్లోనే 4 సిక్సర్లతో 33 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 120 పరుగుల మార్క్ కు చేర్చాడు. తొలి 10 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన పాకిస్థాన్ చివరి 10 ఓవర్లలో 78 పరుగులు చేసి పర్వాలేదనిపించింది.