‘ప్యాక్స్ సిలికా’ కూటమిలో ఇండియా చేరిక: ఢిల్లీలో ఏఐ సమిట్లో ఒప్పందంపై సైన్

‘ప్యాక్స్ సిలికా’ కూటమిలో ఇండియా చేరిక: ఢిల్లీలో ఏఐ సమిట్లో ఒప్పందంపై సైన్
  • చైనాకు చెక్ పెట్టే దిశగా గతేడాది ఏర్పాటైన కొత్త కూటమి 
  • ప్రపంచం భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విశ్వసిస్తోంది: అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ లో సహకారం, భద్రత కోసం అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన ‘ప్యాక్స్ సిలికా’ కూటమిలో భారత్ కూడా మెంబర్ కంట్రీగా  చేరింది. ఢిల్లీలో జరుగుతున్న 'గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమిట్' సందర్భంగా శుక్రవారం భారత్, అమెరికా ఈ మేరకు కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. మిత్రదేశాలు, విశ్వసనీయ భాగస్వాముల మధ్య ఆర్థిక భద్రతను పటిష్టం చేయడంలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఇరుదేశాలు అభివర్ణించాయి.

‘ప్యాక్స్ సిలికా’ కూటమిలో భారత్ చేరికపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ.. "భారత్ మేధో సంపత్తిని గౌరవిస్తుంది. మా వద్ద అపారమైన ప్రతిభావంతులైన యువత ఉన్నారు. మా విదేశాంగ విధానం ప్రపంచ దేశాల్లో నమ్మకాన్ని కలిగించింది. అందుకే ప్రపంచం నేడు భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమ్ముతోంది" అని చెప్పారు. "భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే  10 సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు ప్రక్రియలో ఉన్నాయి. అతి త్వరలోనే మొదటి ప్లాంట్ నుండి వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన 2- నానోమీటర్ చిప్స్ డిజైన్ నేడు భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే జరుగుతోంది" అని ఆయన ప్రకటించారు. రాబోయే కాలంలో గ్లోబల్ సెమీకండక్టర్ రంగంలో 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం ఉంటుందని, ఆ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఏఐ సమిట్​లో ‘ఢిల్లీ ఫ్రేమ్ వర్క్’ ప్రకటన 
భారత్ గురువారం ‘న్యూఢిల్లీ ఫ్రాంటియర్ ఏఐ కమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్’ పేరుతో కూడా ఒక కీలక ప్రకటన చేసింది. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026లో ఇదొక విశేషమైన ఫలితమని కొనియాడారు. ఇండియన్, గ్లోబల్ ఏఐ కంపెనీలు స్వచ్ఛందంగా ఈ ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమోదించాయి. సమ్మిళిత, పారదర్శక ఏఐ కోసం ఈ కంపెనీలు కలిసి పనిచేస్తాయి. "మన దేశీయ ఏఐ కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి సంస్థలు కలిసివచ్చి, సురక్షితమైన ఏఐ వ్యవస్థల కోసం ప్రతిజ్ఞ చేశాయి" అని మంత్రి తెలిపారు. ఈ ఫ్రేమ్ వర్క్ ద్వారా భారత్ గ్లోబల్ ఏఐ రంగంలో తన నాయకత్వ పాత్రను మరింత సుస్థిరం చేసుకుందని భావిస్తున్నారు.

ప్యాక్స్ సిలికా అంటే..
అమెరికా విదేశాంగ శాఖ రూపొందించిన ‘ప్యాక్స్ సిలికా’ ఒప్పందం అనేది ఏఐ, సప్లై చైన్ భద్రతపై దృష్టి సారించే ఒక ప్రధాన వేదిక. ‘‘సాంకేతికత ద్వారా శాంతి, ఆర్థిక భద్రత’’ అనే అర్థంతో దీనికి అమెరికా పేరు పెట్టింది. దేశాల మధ్య విశ్వసనీయమైన సప్లై చైన్ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దీర్ఘకాలిక శ్రేయస్సు కోసం ఒక పరివర్తనాత్మక శక్తిగా గుర్తించడం, కీలక ఖనిజాల నుండి సెమీకండక్టర్ల తయారీ వరకు సురక్షితమైన వ్యవస్థను నిర్మించడం, సాంకేతికతను అడ్డం పెట్టుకుని చేసే ఆర్థిక బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిల్ లేదా బెదిరింపులను అడ్డుకోవడం, ఏఐ, సెమీకండక్టర్ సరఫరా గొలుసులో ఒకే దేశం (ముఖ్యంగా చైనా)పై ఆధారపడటాన్ని తగ్గించడం వంటివి ఈ కూటమి ప్రధాన ఉద్దేశాలు. 

భూమిలో లభించే కీలక ఖనిజాల నుంచి ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో తయారయ్యే సిలికాన్ వేఫర్స్, డేటా సెంటర్లు మరియు అత్యాధునిక ఏఐ మోడల్స్ వరకు ఈ ఒప్పందం పరిధిలోకి వస్తాయి. గత డిసెంబర్ లో వాషింగ్టన్​లో అమెరికా నేతృత్వంలో ప్రారంభమైన ఈ కూటమిలో ఇప్పటికే ఆస్ట్రేలియా, గ్రీస్, ఇజ్రాయెల్, జపాన్, ఖతర్, దక్షిణ కొరియా, సింగపూర్, యూఏఈ, బ్రిటన్ సభ్యదేశాలుగా ఉన్నాయి.