త్వరలోనే భారత్, అమెరికా  ట్రేడ్ డీల్... ఇంధన భద్రతకే తమ ప్రాధాన్యమని వెల్లడి..

త్వరలోనే భారత్, అమెరికా  ట్రేడ్ డీల్... ఇంధన భద్రతకే తమ ప్రాధాన్యమని వెల్లడి..
  • అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 
  • భారత్​తో సంబంధాలు మరింత బలోపేతం 
  • కొత్త వీసా పాలసీ అన్ని దేశాలకూ వర్తిస్తుందని కామెంట్ 
  • ఇంధన మార్కెట్ పరిమితం కాకూడదు: జైశంకర్ 
  • ఢిల్లీలో భేటీ అనంతరం అమెరికా, భారత విదేశాంగ మంత్రుల మీడియా సమావేశం

న్యూఢిల్లీ: భారత్, అమెరికా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ట్రేడ్ డీల్ ను త్వరలోనే ఖరారు కానుందని, ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు రెండు దేశాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. ఇది రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేలా, స్థిరమైన ఒప్పందంగా ఉంటుందన్నారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు కూడా మరింత బలోపేతం అవుతున్నాయని ఆయన తెలిపారు. 

భారత పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తో పశ్చిమాసియా సంక్షోభం, వీసాలు, వాణిజ్యం, క్రిటికల్ మినరల్స్, ఇంధన భద్రత, సరిహద్దు ఉగ్రవాదం, రక్షణ రంగాల్లో సహకారంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు మంత్రులు ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడారు. "మా వాణిజ్య ప్రతినిధి అతి త్వరలోనే ఇక్కడకు వస్తారు. మాకు అమెరికాలో ఒక భారతీయ ప్రతినిధి బృందం ఉంది. 

మేం అద్భుతమైన పురోగతిని సాధించాం. అమెరికా, భారత్ మధ్య దీర్ఘకాలం, ఇరుపక్షాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా స్థిరమైన వాణిజ్య ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నా" రూబియో చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వం పాటించే వాణిజ్య విధానం ప్రత్యేకంగా ఏ ఒక్క దేశానికీ వ్యతిరేకంగా లేదన్నారు. భారత్ తో వాణిజ్యంలో అసమతుల్యత ఉందని, దానిని పరిష్కరించాలని మాత్రమే ట్రంప్ చెప్పారన్నారు. 

భారత్ ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ అని, అందుకే భారత్ తో వాణిజ్యానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అమెరికా, -భారత్ సంబంధాలు క్షీణించాయన్న అభిప్రాయాలను ఆయన తోసిపుచ్చారు. ట్రంప్ ప్రభుత్వ పదవీకాలం ముగిసే సమయానికి ఈ భాగస్వామ్యం మరింత బలంగా మారుతుందని గట్టిగా చెప్పారు.

ప్రపంచ స్థిరత్వం కోసం 5 సూత్రాలు: జైశంకర్ 

భారతదేశ విదేశాంగ విధాన ప్రాధాన్యతలను స్పష్టంగా తెలియజేస్తూ, ప్రపంచ స్థిరత్వం కోసం జైశంకర్ వ్యూహాత్మక ఐదు సూత్రాల ముసాయిదాను వివరించారు. ఘర్షణలను పరిష్కరించడానికి భారతదేశం చర్చలు, దౌత్యాలను సమర్థిస్తుందని, అంతరాయం లేని సముద్ర వాణిజ్యానికి మద్దతు ఇస్తుందని, అంతర్జాతీయ చట్టాలను ఖచ్చితంగా గౌరవించాలని డిమాండ్ చేస్తుందని, మార్కెట్ వాటాలు, వనరులను ఆయుధంగా మార్చుకోవడానికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ‘భారతదేశానికి బహుళ ఇంధన వనరులు ఉండటం చాలా ముఖ్యం. హార్మూజ్‌‌లోని ప్రస్తుత పరిస్థితిని మేం ఎదుర్కొనే విధానం, స్పష్టంగా చెప్పాలంటే భవిష్యత్తులో కూడా మా ఇంధన వనరులను వైవిధ్యపరచడమే. 

ఎందుకంటే అది మా ఇంధన భద్రతకు గుండెకాయలాంటిది, అందుకే ఇంధన మార్కెట్ పరిమితం కాకూడదని మేం బలంగా భావిస్తున్నాం. ప్రపంచ వృద్ధికి ఇంధన ధరలను తక్కువగా ఉంచడం చాలా ముఖ్యం’ అని ఆయన చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, గల్ఫ్ దేశాలతో చాలా మంచి సంబంధాలు ఉన్న అతికొద్ది దేశాలలో భారతదేశం ఒకటి అని, అందుకే అన్ని దేశాలతోనూ సంబంధాలను తమకు ముఖ్యమని జైశంకర్ చెప్పారు. 

కాగా, ట్రంప్ ప్రభుత్వ వీసా, వలస విధానాల మార్పులపై భారతదేశ ఆందోళనలను రూబియో వద్ద జైశంకర్ ప్రస్తావించారు. కొత్త విధానం వల్ల చట్టపరమైన వలసలపై ప్రతికూల ప్రభావం పడకూడదని చెప్పారు. అయితే, అమెరికా వలస విధానాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నందున ఈ పరివర్తన కాలంలో కొన్ని అడ్డంకులు, ఘర్షణలు ఉండవచ్చని రూబియో అంగీకరించారు. 

కానీ అంతిమంగా ఒక  సమర్థవంతమైన ఫ్రేమ్‌‌వర్క్ అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. వలస విధానాన్ని సంస్కరించడానికి ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నది కాదని, ప్రపంచమంతటికీ వర్తిస్తుందన్నారు.