టికెట్లు దొరకక.. అభిమానులు పరేషాన్

టికెట్లు దొరకక.. అభిమానులు పరేషాన్

కంటోన్మెంట్, వెలుగు: ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా 25న జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్​కు టికెట్లు దొరకడం లేదు. దీంతో అభిమానులు పరేషాన్​ అవుతున్నారు. అటు ఆన్​లైన్​లో.. ఇటు ఆఫ్​లైన్​లోనూ టికెట్లు అందుబాటులో లేకపోవడంతో వందలాది మంది క్రికెట్ అభిమానులు సికింద్రాబాద్​లోని జింఖానా గ్రౌండ్​కు తరలివచ్చారు. దీంతో సెక్యూరిటీ గార్డులు గేట్​కు తాళం వేశారు. కొంత మంది గోడ దూకి లోపలికి వెళ్లడంతో లాఠీచార్జ్​ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. జింఖానా గ్రౌండ్ కు చేరుకున్నారు. అప్పటికే భారీగా ట్రాఫిక్​ జామ్​ కావడంతో క్లియర్​ చేశారు. తర్వాత అభిమానులంతా టికెట్​ కౌంటర్ల వద్ద క్యూ కట్టారు. అయితే ఎప్పటి నుంచి టికెట్లు ఇస్తారో మాత్రం తెలియకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

క్రికెట్ అభిమానులు సీరియస్

14వ తేదీ నుంచి జింఖానా గ్రౌండ్​ చుట్టూ తిరుగుతు న్నామని, టికెట్లు అమ్ముతామని చెబుతున్నా.. కౌంటర్లు ఓపెన్​ చేయడం లేదని క్రికెట్​ అభిమానులు మండిపడ్డారు. గంటల కొద్దీ వెయిట్​ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎప్పుడొచ్చినా.. రేపు.. రేపు.. అంటున్నారే తప్ప సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. ఒక రోజు మాత్రమే పేటీఎంలో బుకింగ్​కు చాన్స్​ ఇచ్చారని, అది కూడా ఒక నంబర్​కు ఒకే టికెట్​ ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత సైట్​ను మూ సేశారని, తీరా ఇక్కడి వస్తే రోజూ తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. స్పోర్ట్స్​ను పాలిటిక్స్​ చేయడం ఏంటని క్రికెట్ అభిమానులు ప్రశ్నించారు. టికెట్లు అమ్ముతారా.. లేదా.. చెబితే ఇక్కడికి వచ్చేవాళ్లం కాదని చెబుతున్నారు. 

హెచ్‌‌ఆర్‌‌‌‌సీలో హైకోర్ట్‌‌ లాయర్‌‌ ఫిర్యాదు

క్రికెట్ మ్యాచ్ టికెట్లు బ్లాక్​లో అమ్ముతున్నారని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ)పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్ట్‌‌ లాయర్‌‌‌‌ సలీం, హెచ్‌‌ఆర్‌‌‌‌సీలో ఫిర్యాదు చేశారు. టికెట్లను కొందరు బ్లాక్‌‌లో అమ్ముతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రీడాభిమానులను మోసం చేసేలా హెచ్‌‌సీఏ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. మూడేండ్ల తర్వాత హైదరాబాద్‌‌లో మ్యాచ్‌‌ జరుగుతున్నదన్నారు. టికెట్లను బ్లాక్‌‌లో అమ్ముతుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. హెచ్‌‌సీఏపై చర్యలు తీసుకోవాలని కోరారు. అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఈ పిటిషన్​పై కమిషన్ మంగళవారం విచారించిన కమిషన్, బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.