చైనా చిల్లర గొడవలు: వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ నుంచి తప్పుకున్న ఇండియా

చైనా చిల్లర గొడవలు: వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ నుంచి తప్పుకున్న ఇండియా

చైనా ఆగడాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి. ఇన్నాళ్లు భారత భూభాగాలను చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తూ విషం చిమ్మిన డ్రాగన్ కంట్రీ.. మరోసారి అలాంటి దుందుడుకు చర్యలు పాల్పడింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు అథ్లెట్లకు స్టాంప్డ్ వీసాలకు బదులుగా స్టేపుల్ వీసాలు మంజూరు చేసింది. దీన్ని నిరసిస్తూ భారత ప్రభుత్వం.. చెంగ్డూ వేదికగా జరగనున్న వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్ ను బహిష్కరించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తూ డ్రాగన్ కంట్రీ చేసిన ఈ చర్య ఆమోదయోగ్యం కాదని విదేశాంగ అధికారి తెలిపారు.   

గురువారం రాత్రి చెంగ్డూ(చైనా)కు బయలుదేరిన ఎనిమిది మంది సభ్యుల బృందాన్ని విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. వీరిలో ఐదుగురు అథ్లెట్లు కాగా, ఒకరు కోచ్ మరో ఇద్దరు సహాయక సిబ్బంది ఉన్నారు. వీరికి చైనా ప్రభుత్వం.. స్టాంప్డ్ వీసాలకు బదులుగా స్టేపుల్ వీసాలు జారీ చేయడమే అందుకు కారణం. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే భారత ప్రభుత్వం.. ఈ టోర్నీ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది.

స్టేపుల్డ్ వీసా అంటే ఏమిటి?

పాస్‌పోర్ట్‌పై స్టాంప్ వేయరు. పర్యటనకు అనుమతి ఇస్తున్నట్లు పాస్‌పోర్ట్‌‌కు అనుబంధంగా కొన్ని కరపత్రాలుగా పిన్ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఒక వ్యక్తి పర్యటన ముగిశాక.. వాటిని తొలగిస్తారు. వారి పర్యటనకు సంబంధించి అధికారిక లెక్కలుండవు.

స్టేపుల్డ్ వీసాలు ఎందుకు జారీ చేస్తోంది

భారత భూబాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను చైనా తన అంతర్భాగాలుగా గుర్తిస్తోంది. ఆ వివాదాస్పద ప్రాంతాల నుంచి ఎవరైనా వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి స్టేపుల్డ్ వీసాలు మంజూరు చేస్తోంది. గతంలోనూ అరుణాచల్ ప్రదేశ్‌లోని అథ్లెట్లకు స్టాంప్‌డ్ వీసాలు ఇచ్చేందుకు చైనా నిరాకరించింది. 2011లో, అరుణాచల్‌కు చెందిన ఐదుగురు కరాటే అభ్యర్థులకు క్వాన్‌జౌలో జరిగిన పోటీలో పాల్గొనేందుకు స్టేపుల్డ్ వీసాలు మంజూరు చేసింది.