V6 News

మిడిల్‌ కథకు మోక్షం దొరికేనా!   

మిడిల్‌ కథకు మోక్షం దొరికేనా!   
  •  పాండే, అయ్యర్‌కు మిడిల్‌ బాధ్యతలు?
  • రేపటి నుంచి వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌

ఎన్ని సిరీస్‌‌లు ఆడుతున్నా…. ఎన్ని దేశాలు తిరుగుతున్నా.. ఎంత మంది ఆటగాళ్లను పరీక్షిస్తున్నా.. టీమిండియాను పట్టి పీడిస్తున్న మిడిలార్డర్‌‌ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు. కొద్ది రోజులు అజింక్యా రహానె, మరికొన్ని రోజులు అంబటి రాయుడు, ఆ తర్వాత విజయ్​ శంకర్‌‌‌‌తో సమయాన్ని వృథా చేసిన మేనేజ్‌‌మెంట్‌‌ వరల్డ్‌‌కప్‌‌లో భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఆ మెగా టోర్నీ తర్వాత అయినా పాఠాలు నేర్వాలని భావిస్తున్న మేనేజ్‌‌మెంట్‌‌ ఈ సమస్యకు వెంటనే చెక్‌‌ పెట్టాలని అనుకుంటోంది. అందుకోసం వెస్టిండీస్‌‌ టూర్‌‌ను సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. వరల్డ్‌‌కప్ తప్పులు పునరావృతం కాకుండా చూసేందుకు.. కరీబియన్‌‌ దీవుల్లోనే మిడిలార్డర్‌‌ను నడిపించే సరైన మొనగాళ్లను తయారు చేయాలని అనుకుంటోంది.

ఈ క్రమంలో విండీస్‌‌తో లిమిటెడ్‌‌ ఓవర్ల సిరీస్‌‌ల్లో యువ ఆటగాళ్లు మనీశ్​​పాండే, శ్రేయస్​అయ్యర్‌‌కు అవకాశాలు ఇచ్చి మిడిల్‌‌ను బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. శనివారం మొదలయ్యే టీ20 సిరీస్‌‌లో మనీశ్​ పాండే, శ్రేయస్‌‌ అయ్యర్‌‌లో ఒకరు కచ్చితంగా తుది జట్టులో ఉండడంతో పాటు మిడిలార్డర్‌‌లో ఆడే అవకాశాలు పుష్కలం. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌‌ను దృష్టిలో ఉంచుకొని కుర్రాళ్లకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చూస్తున్న సెలెక్టర్లు, మేనేజ్‌‌మెంట్‌‌కు విండీస్‌‌ టూర్‌‌ సరైన వేదిక అనొచ్చు. అయితే, ఈ సిరీస్‌‌లో పాండే, అయ్యర్‌‌కు లోకేశ్‌‌ రాహుల్‌‌, కేదార్‌‌ జాదవ్‌‌ రూపంలో గట్టి పోటీ ఎదురవనుంది. కానీ, యువ ప్లేయర్లకు చాన్స్‌‌లు ఇస్తామని చీఫ్‌‌ సెలెక్టర్‌‌ ఎమ్మెస్కే ప్రసాద్‌‌ ఇదివరకే చెప్పడంతో ఈ ఇద్దరికి తలుపులు తెరుచుకున్నట్టే. పైగా, వరల్డ్‌‌కప్‌‌లో గాయపడ్డ ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ పూర్తి ఫిట్‌‌నెస్‌‌ సాధించాడో లేదో తెలియదు. అతను ఆడకుంటే లోకేశ్‌‌ రాహుల్‌‌ ఓపెనింగ్‌‌ చేయడం లాంఛనమే. కేదార్‌‌ జాదవ్‌‌కు ఇప్పటికే చాలా చాన్స్‌‌లు ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఈ లెక్కన కరీబియన్లపై పాండే, అయ్యర్​  వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌‌లు ఆడే అవకాశం ఉంది.

ఈ సారి ఏం చేస్తారో..

వాస్తవానికి పాండే, అయ్యర్ ప్రపంచకప్​ ప్రణాళికల్లో ఉన్నప్పటికీ పేలవ పెర్ఫామెన్స్‌‌ వారిని జట్టుకు దూరం చేసింది. 2016 ఆస్ట్రేలియా టూర్‌‌లో అద్భుత సెంచరీతో మనీశ్​ ఆకట్టుకున్నప్పటికీ అనంతరం పూర్తిగా విఫలమయ్యాడు. ఆరు వన్డేలు ఆడిన అయ్యర్​ 42 సగటుతో, రెండు హాఫ్‌‌ సెంచరీలు మాత్రమే సాధించాడు. ఈ పెర్ఫామెన్స్‌‌ సెలెక్టర్లను సంతృప్తి పరచకపోవడంతో టీమ్‌‌లో చోటు కోల్పోయాడు. అయితే, ఐపీఎల్​తో పాటు, ఇండియా–ఎ తరఫున వెస్టిండీస్​లో ఆడిన అనధికార మ్యాచ్​ల్లో సత్తా చాటిన ఈ ఇద్దరూ సీనియర్ జట్టు నుంచి మళ్లీ పిలుపందుకున్నారు.  మరి, ఈ చాన్స్‌‌ను పాండే, అయ్యర్‌‌ ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ఇప్పటికే విండీస్‌‌ పరిస్థితులపై పూర్తి అవగాహన వచ్చినందున.. ఈ టూర్‌‌లో రాణిస్తే ఈ ఇద్దరి కెరీర్‌‌ పదునెక్కడం ఖాయం. అదే సమయంలో ఇండియా మిడిలార్డర్‌‌ సమస్యకు కూడా పరిష్కారం లభించినట్టే.