
సొంతంచెలరేగిన రాహుల్, రోహిత్, కోహ్లీ
రోహిత్ (34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71) సుడిగాలిలా చెలరేగిన వేళ.. విరాట్(29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 70) సునామీలా విరుచుకుపడిన చోట.. రాహుల్ (56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 91) ధైర్యంగా దంచికొట్టిన తరుణంలో.. వాంఖడే పరుగుల ఉప్పెనలో తడిసి ముద్దైంది..! కరీబియన్ ఆజానుబాహులందరూ బౌలింగ్ వేయటానికి వెనుకాడిన పరిస్థితి.. బంతి దెబ్బలకు బౌండరీ రోప్ తాళలేని స్థితి.. స్టాండ్స్‌లోని ప్రేక్షకులే ఫీల్డర్లు అయిన నేపథ్యంలో.. టీమిండియా త్రయం విశ్వరూపం చూపెట్టింది..! ఫలితంగా మూడో టీ20లో గ్రాండ్ విక్టరీతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది..!! పొలార్డ్ (39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68) కాసేపు పోరాడినా.. టీమ్‌ను గెలిపించలేకపోయాడు.
ముంబై: వారెవ్వా.. ఏం కొట్టారు..! ఒకర్ని మించి మరొకరు.. ఒకరు కాకపోతే ఇంకొక్కరు అనే స్థాయిలో విండీస్ బౌలింగ్‌ను ఊచకోత కోసిన టీమిండియా.. మూడో టీ20ల్లో ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 67 రన్స్ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను విరాట్‌సేన 2–1తో కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 రన్స్ చేసింది. తర్వాత విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 రన్స్ మాత్రమే చేసి ఓడింది. పొలార్డ్‌తో పాటు హెట్‌మయర్ (24 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 41) ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ కోసం చహల్, జడేజా ప్లేస్‌లో కుల్దీప్, షమీని తీసుకున్న కోహ్లీ.. వన్డే సిరీస్‌కు ముందు ఘనమైన విజయాన్ని అందుకున్నాడు. రాహుల్ కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
రోహిత్, రాహుల్ విశ్వరూపం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఓపెనర్ రోహిత్, రాహుల్ ఆరంభంలో విశ్వరూపం చూపెట్టారు. పోటీపడి బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో స్కోరు బోర్దు వాయు వేగంతో పరుగెత్తింది. తొలి ఓవర్‌లో ఫోర్‌తో మొదలైన రోహిత్ అటాకింగ్.. 12వ ఓవర్ వరకు సాగింది. రెండో ఓవర్‌లో రాహుల్.. రెండు ఫోర్లు కొడితే.. మూడో ఓవర్‌లో రోహిత్ 6, 4, 4తో రెచ్చిపోయాడు. అయితే పైర్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన ఈ ముంబైకర్ రెండో బంతిని అంతే జోరులో పైకి లేపాడు. బౌండరీ లైన్ వద్ద లూయిస్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నా.. బ్యాలెన్స్ తప్పి బయటకు దూకాడు. ఆ వెంటనే రోహిత్ ఫోర్‌తో రెచ్చిపోయాడు. ఐదో ఓవర్‌లో రాహుల్ కూడా 4, 6, 4 బాదడంతో పవర్‌ప్లేలో ఇండియా 12 రన్‌రేట్‌తో 72 రన్స్ చేసింది. ఫీల్డింగ్‌ను విస్తరించినా.. రోహిత్ విధ్వంసం మాత్రం ఆగలేదు. పైర్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో 6, 6, 4తో 21 రన్స్ పిండుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ 23 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ఛేంజ్ బౌలర్‌గా వచ్చిన వాల్ష్ 5 రన్స్‌తో సరిపెట్టడంతో తొలి 10 ఓవర్లలో టీమిండియా స్కోరు 116/0కు చేరింది. రాహుల్ కూడా 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. వాల్ష్ వేసిన 11వ ఓవర్‌లో ఇద్దరు కలిసి 6, 4, 4 తో 16 రన్స్ రాబట్టారు. సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్‌కు 12వ ఓవర్‌లో విలియమ్స్ బ్రేక్ వేశాడు. . దీంతో తొలి వికెట్‌కు 70 బంతుల్లో 135 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. నాలుగు బంతుల తర్వాత రిషబ్ పంత్ (0) డకౌట్ కావడంతో స్కోరు 138/2గా మారింది.
విరాట్ విధ్వంసం
12వ ఓవర్ మధ్యలో క్రీజులోకి వచ్చిన విరాట్ పూనకం వచ్చినట్లు చెలరేగాడు. ఆడిన ఐదో బంతిని స్టాండ్స్‌లో పంపి టచ్‌లోకి వచ్చిన కెప్టెన్.. 15వ ఓవర్‌లో మరో దశకు తీసుకెళ్లాడు. హోల్డర్ వేసిన ఈ ఓవర్‌లో రాహుల్ 6 కొడితే… విరాట్ 4, 6, 4 బాదేశాడు. మధ్యలో రనౌట్ నుంచి బయటపడినా 22 రన్స్ వచ్చాయి. విలియమ్స్ కవ్వింపులకు చిరాకుపడ్డ కోహ్లీ భారీ షాట్లకు ప్రయత్నించినా సఫలం కాలేదు. కానీ 18వ (విలియమ్స్) ఓవర్లో రెండు సిక్స్‌లతో 17 రన్స్ రాబట్టి కసి తీర్చుకున్నాడు. ఫలితంగా ఇండియా స్కోరు 200లు దాటింది. పొలార్డ్ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా 6, 6, 4, 6 కొట్టిన విరాట్ 21 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఓవర్‌లో 23 రన్స్ వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో అప్పీల్‌తో గట్టెక్కిన రాహుల్, ఔట్‌సైడ్ ఆఫ్ బాల్‌ను వెంటాడి ఔటయ్యాడు. మూడో వికెట్‌కు 45 బంతుల్లోనే 95 రన్స్ సమకూర్చారు.
పొలార్డ్ దూకుడు..
భారీ టార్గెట్ ఛేజ్‌లో విండీస్‌కు వరుస దెబ్బలు తగిలినా. పొలార్డ్, హెట్‌మయర్ దూకుడుగా ఆడారు. తొలి నాలుగు ఓవర్లలోనే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కింగ్ (5), సిమ్మన్ (7), పూరన్ (0) ఔటైనా.. ఈ ఇద్దరు కీలక భాగస్వామ్యంతో రెచ్చిపోయారు. 17/3 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన పొలార్డ్.. భారీ సిక్సర్లతో దుమ్మురేపాడు. షమీ వేసిన ఐదో ఓవర్‌లో హెట్‌మయర్ రెండు సిక్స్‌లు, తర్వాతి ఓవర్‌లో పొలార్డ్ ఓ సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లేలో విండీస్ స్కోరు 41/3కి చేరింది. దూబే వేసిన ఏడో ఓవర్‌లో 6, 4, 4, 4తో 19 రన్స్ రాబట్టిన పొలార్డ్ హిట్టింగ్‌లో మరో మెట్టు ఎక్కాడు. తొమ్మిదో ఓవర్లో హెట్‌మయర్ ఇచ్చిన క్యాచ్‌ను దూబే డ్రాప్ చేసినా పొలార్డ్ సిక్స్ కొట్టాడు. కుల్దీప్ వేసిన 10వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన హెట్‌మయర్.. మూడో బంతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 74 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. 11వ ఓవర్‌లో విండీస్ స్కోరు 100 దాటినా వికెట్లపతనం ఆగలేదు. హోల్డర్ (8) ఎక్కువసేపు ఆడలేకపోయాడు. 14వ ఓవర్‌లో పొలార్డ్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 17 రన్స్ పిండుకున్నాడు. భువనేశ్వర్ వేసిన 15వ ఓవర్‌లో 6, 4, 4 బాదిన పొలార్డ్.. అదే జోరుతో లాస్ట్ బాల్‌ను గాల్లోకి లేపాడు. రోప్ వద్ద జడేజా క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఆరో వికెట్‌కు 38 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. అప్పటికే చేయాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో వాల్ష్ (11), పైర్ (6) ఒత్తిడికి లోనయ్యారు. క్రెసిక్ విలియమ్స్ (13 నాటౌట్) ఒకటి, రెండు మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది.
స్కోరు బోర్డు
ఇండియా: రోహిత్ (సి) వాల్ష్ (బి) విలియమ్స్ 71, రాహుల్ (సి) పూరన్ (బి) కొట్రెల్ 91, రిషబ్ (సి) హోల్డర్ (బి) పొలార్డ్ 0, కోహ్లీ (నాటౌట్) 70, శ్రేయస్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 8,
మొత్తం: 20 ఓవర్లలో 240/3.
వికెట్లపతనం: 1–135, 2–138, 3–233. బౌలింగ్: కొట్రెల్ 4–0–40–1, హోల్డర్ 4–0–54–0, పైర్ 2–0–35–0, విలియమ్స్ 4–0–37–1, వాల్స్ 4–0–38–0, పొలార్డ్ 2–0–33–1.
వెస్టిండీస్: సిమ్మన్స్ (సి) శ్రేయస్ (బి) షమీ 7, కింగ్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 5, హెట్‌మయర్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 41, పూరన్ (సి) దూబే (బి) చాహర్ 0, పొలార్డ్ (సబ్) జడేజా (బి) భువనేశ్వర్ 68, హోల్డర్ (సబ్) మనీష్ (బి) కుల్దీప్ 8, వాల్స్ (బి) షమీ 11, పైర్ (సబ్) జడేజా (బి) చాహర్ 6, విలియమ్స్ (నాటౌట్) 13, కొట్రెల్ (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 10,
మొత్తం: 20 ఓవర్లలో 173/8.
వికెట్లపతనం: 1–12, 2–17, 3–17, 4–91, 5–103, 6–141, 7–152, 8–169.
బౌలింగ్: దీపక్ చాహర్ 4–0–20–2, భువనేశ్వర్ కుమార్ 4–0–41–2, మహ్మద్ షమీ 4–0–25–2, శివమ్ దూబే 3–0–32–0, కుల్దీప్ యాదవ్ 4–0–45–2, వాషింగ్టన్ సుందర్ 1–0–5–0.