టీ20 వరల్డ్ కప్ 2026 ముందు యుఎస్ఎ ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ కు ఊహించని సమస్య వచ్చి పడింది. ఇండియా, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2026కు నెల రోజుల కంటే తక్కువగా సమయం ఉంది. ఈ సమయంలో USA అలీ ఖాన్ కు వీసా తిరస్కరించబడింది. పాకిస్థాన్ సంతతి క్రికెటర్ కావడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. సోమవారం (జనవరి 12) అలీ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ కథనాన్ని పోస్ట్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ లో "భారత వీసా నిరాకరించబడింది. కానీ విజయానికి KFC" అని రాసి ఉంది.
అలీ ఖాన్ మాత్రమే కాదు మరికొంత మంది పాకిస్థాన్ కు చెందిన అమెరికా క్రికెటర్లు కూడా వీసా అడ్డంకిని ఎదర్కొనే అవకాశం ఉన్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. USA వికెట్ కీపర్-బ్యాటర్ షయాన్ జహంగీర్ తో పాటు బౌలర్లు ఎహ్సాన్ ఆదిల్, మొహమ్మద్ మొహ్సిన్ వంటి ఇతర USA క్రికెటర్లు కూడా వీసా సంపాదించడం కష్టంగా మారనుంది. USA క్రికెటర్లతో పాటు అనేక అసోసియేట్ జట్లకు కూడా వీసా సమస్యలు ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. పాకిస్తాన్ సంతతికి చెందిన ఆటగాళ్లు లేదా పాకిస్తాన్ డాక్యుమెంటేషన్ లింక్‌లతో ఉన్న ఆటగాళ్లు వీసా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై అటు USA క్రికెట్ బోర్డు గానీ ఐసీసీ కానీ ఇంకా స్పందించలేదు.
అలీఖాన్ లాంటి ఫ్రంట్‌లైన్ సీమర్‌ను కోల్పోతే USA కు వరల్డ్ కప్ లో పెద్ద ఎదురు దెబ్బే. అలీ ఖాన్ పాకిస్తాన్‌లోని అటాక్‌లో పుట్టి పెరిగాడు. 19 ఏళ్ల వయసులో అతని కుటుంబం అమెరికాకు వెళ్లింది. అమెరికా తరపున ఈ ఫాస్ట్ బౌలర్ ఇప్పటివరకు 15 వన్డేలు, 18 టీ20లు ఆడాడు. వరల్డ్ కప్ లో యుఎస్ఎ టీమిండియాతో కలిసి గ్రూప్ A లో ఉంది. ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆతిథ్య ఇండియాతో USA తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు. ఆ తర్వాత చెన్నైలో నెదర్లాండ్స్, నమీబియాతో మ్యాచ్‌లు జరుగుతాయి. వరల్డ్ కప్ కు USA క్రికెట్ బోర్డు ఇంకా తమ జట్టును ప్రకటించలేదు.
