- జీ7లో గ్లోబల్ సౌత్ ఆశయాలు, ఆందోళనలను ప్రస్తావిస్తం
- ద్వైపాక్షిక చర్చలు, ఇన్నోవేషన్పార్ట్నర్షిప్పై ప్రత్యేక దృష్టి
- వారం రోజుల ఫ్రాన్స్, స్లొవేకియా టూర్‌కు బయల్దేరిన ప్రధాని
న్యూఢిల్లీ: జీ7 సదస్సుకు భారత్‌ను వరుసగా ఎనిమిదోసారి ఆహ్వానించడం దేశంపై అంతర్జాతీయ భాగస్వాములు ఉంచుతున్న విశ్వాసానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇది స్పష్టం చేస్తున్నదని చెప్పారు. ఫ్రాన్స్, స్లొవేకియా వారం రోజుల అధికారిక పర్యటనకు మోదీ శనివారం బయల్దేరారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని జూన్ 16, 17వ తేదీల్లో ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరిగే జీ7 సదస్సులో పాల్గొననున్నారు.
జీ7 వేదికపై భారత్ తన ప్రయోజనాల గురించి మాత్రమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న దేశాలు, గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు, అవసరాలు, ఆందోళనలకు సైతం గొంతుకగా నిలుస్తుందని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. తన ఫ్రాన్స్, స్లొవేకియా పర్యటన యూరప్‌తో పాటు జీ7 దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలను విస్తరించాలన్న భారత సంకల్పాన్ని ఈ టూర్ ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో ప్రపంచ నాయకులతో బైలేటరల్, రీజనల్, ఇంటర్నేషనల్ అంశాలపై చర్చలు జరపనున్నట్లు వివరించారు.
నేడు ‘భారత్ ఇన్నోవేట్స్’ ప్రారంభం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటనలో ఫ్రాన్స్‌కు భారత వ్యూహాత్మక దృష్టిలో ప్రత్యేక స్థానం ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మాక్రాన్ భారత్ ను సందర్శించిన సందర్భంగా ఇరు దేశాలు తమ సంబంధాలను ‘స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్’ స్థాయికి తీసుకెళ్లాయని గుర్తుచేశారు. జూన్ 14న నీస్‌లో మాక్రాన్‌తో కలిసి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.
భారత్ -ఫ్రాన్స్ ఇన్నోవేషన్ సంవత్సరానికి అనుసంధానంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భారత స్టార్టప్‌లను అంతర్జాతీయ పెట్టుబడిదారులతో కలిపే కీలక వేదికగా నిలవనుంది. ఉన్నత విద్యా సంస్థల నుంచి వెలువడుతున్న ఆవిష్కరణలకు ఇది వేగవంతమైన ప్రోత్సాహకంగా పనిచేస్తుందని మోదీ పేర్కొన్నారు. అనంతరం పారిస్‌లో జూన్ 18న జరిగే వివాటెక్–2026లో మాక్రాన్‌తో కలిసి పాల్గొననున్నారు.
యూరప్‌లోనే అతిపెద్ద సాంకేతిక, ఆవిష్కరణ సదస్సుగా గుర్తింపు పొందిన ఈ కార్యక్రమంలో భారత్ అతిపెద్ద జాతీయ పెవిలియన్‌ను ఏర్పాటు చేయనుండటం, భారత-యూరోపియన్ ఆవిష్కరణ వ్యవస్థల మధ్య ఉన్న విస్తృత భాగస్వామ్య అవకాశాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన చెప్పారు. అలాగే పారిస్‌లోని భారతీయ ప్రవాసులను కలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
స్లొవేకియా వెళ్తున్న తొలి భారత ప్రధాని
ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ 14,-15వ తేదీల్లో స్లొవేకియాలో పర్యటన చేపట్టనున్నారు. 1993లో స్లొవేకియా స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఆ దేశాన్ని సందర్శిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం గమనార్హం. ఈ పర్యటనను గొప్ప మైలురాయిగా అభివర్ణించిన ఆయన.. స్లొవేకియా ప్రెసిడెంట్ పీటర్ పెల్లెగ్రిని, ప్రధాని రాబర్ట్ ఫికోలతో బ్రాటిస్లావాలో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల పెంపుపై చర్చించనున్నారు.
అలాగే, అక్కడి వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులతో కూడా సమావేశం కానున్నారు. భారత్- యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చలకు ఊపందుతున్న నేపథ్యంలో ఈ పర్యటన భారత్- యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు.
17న మోదీ, ట్రంప్ భేటీ
వాషింగ్టన్: ఈ నెల17న ఫ్రాన్స్‌లో జరగనున్న జీ-7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధికారులు శనివారం ధ్రువీకరించారు. జీ7 సదస్సులో పాల్గొనడానికి ట్రంప్ సోమవారం ఉదయం అమెరికా నుంచి ఫ్రాన్స్‌కు బయలుదేరుతారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని మోదీతో పాటు ఈజిప్ట్, ఖతార్, యూఏఈ, ఫ్రాన్స్ దేశాల అధినేతలతో కూడా విడివిడిగా సమావేశమై చర్చలు జరుపుతారు.
