టాప్‌‌ 5లో చోటే లక్ష్యంగా బరిలోకి ఇండియా

టాప్‌‌ 5లో చోటే లక్ష్యంగా బరిలోకి ఇండియా
  •   ఇండియా ఫ్లాగ్‌‌ బేరర్‌‌గా సింధు
  •     నేడు ఓపెనింగ్‌‌ సెర్మనీ 
  •      రా. 11.30 నుంచి     సోనీ, డీడీ స్పోర్ట్స్​లో లైవ్​

బర్మింగ్‌‌హామ్‌‌:ఒలింపిక్స్‌‌లో ఒకటి రెండు పతకాలకే మురిసిపోయే ఇండియా.. కామన్వెల్త్‌‌ అనగానే ఖతర్నాక్‌‌ ఆట చూపెడుతుంది. పదుల సంఖ్యలో పతకాలు కొల్లగొడుతూ ఫ్యాన్స్‌‌ను ఖుషీ చేస్తోంది. 2002 నుంచి ఈ మెగా క్రీడల్లో టాప్‌‌5లో నిలుస్తూ వస్తోంది. 2018లో  గోల్డ్‌‌కోస్ట్‌‌లో జరిగిన గత ఎడిషన్లో 66 పతకాలతో మూడో స్థానం సాధించింది. అందులో పాతిక శాతం పతకాలు షూటర్లే తెచ్చారు. కానీ, ప్రస్తుత గేమ్స్‌‌లో షూటింగ్ లేకపోవడం ఇండియా అవకాశాలను కచ్చితంగా దెబ్బతీస్తుంది. దాంతో ఈసారి వెయిట్‌‌లిఫ్టింగ్‌‌, బ్యాడ్మింటన్‌‌, బాక్సింగ్‌‌, రెజ్లింగ్‌‌, టేబుల్‌‌ టెన్నిస్‌‌పై భారీ ఆశలు పెట్టుకుంది. అథ్లెటిక్స్‌‌లోనూ మెరుగైన ఫలితం వస్తుందని ఆశిస్తే ఒలింపిక్‌‌ చాంప్​  నీరజ్‌‌ చోప్రా గాయంతో పోటీలకు దూరం అవడంతో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. చోప్రా స్థానంలో ఇండియా ఫ్లాగ్​ బేరర్​గా ఎంపికైన పీవీ సింధు గురువారం రాత్రి జరిగే ఓపెనింగ్​ సెర్మనీలో జాతీయ పతాకాన్ని పట్టుకుని అథ్లెట్ల బృందం ముందు నడవనుంది. ఇందులో 164 మంది అథ్లెట్లు, అధికారులు పాల్గొంటారు. సింధు 2018 పోటీల్లోనూ ఫ్లాగ్​ బేరర్​గా వ్యవహరించింది. 

వీళ్లపై ఫోకస్‌‌

రెజ్లింగ్‌‌లో  పోటీ పడుతున్న 12 మంది రెజ్లర్ల నుంచి పతకాలు ఆశించొచ్చు. డిఫెండింగ్‌‌ చాంపియన్లు అయిన వినేశ్‌‌ ఫొగట్‌‌, బజ్‌‌రంగ్‌‌ పునియాతో పాటు టోక్యో ఒలింపిక్స్‌‌ సిల్వర్‌‌ మెడలిస్ట్ రవి దహియా గోల్డ్‌‌ మెడల్‌‌ ఫేవరెట్లు. గత ఎడిషన్‌‌లో నాలుగు గోల్డ్‌‌ సహా తొమ్మిది పతకాలు నెగ్గిన వెయిట్‌‌ 
లిఫ్టర్లు ఈసారి 10 ప్లస్‌‌ పతకాలపై ఫోకస్‌‌ పెట్టారు. ఒలింపిక్‌‌ సిల్వర్‌‌ మెడలిస్ట్‌‌ మీరాబాయి చాను ఈ విభాగాన్ని ముందుండి నడిపించనుంది. సూపర్ స్టార్‌‌ పీవీ సింధు నేతృత్వంలోని బ్యాడ్మింటన్‌‌ టీమ్‌‌పై కూడా భారీ అంచనాలున్నాయి. సింధుతోపాటు శ్రీకాంత్‌‌, లక్ష్యసేన్‌‌ ఫేవరెట్లుగా బరిలో నిలిచారు.  గోల్డ్‌‌కోస్ట్​లో ఇండియా టేబుల్ టెన్నిస్‌‌ టీమ్‌‌ ఎనిమిది పతకాలతో టాప్‌‌ ప్లేస్‌‌ సాధించింది. ఇందులో సగం మనికా బాత్రానే సాధించింది. ప్రస్తుత ఫామ్‌‌ దృష్ట్యా ఆ స్థాయి పెర్ఫామెన్స్‌‌ ఆశించకపోయినా.. ఆమె నుంచి రెండు గోల్డ్‌‌ మెడల్స్‌‌ ఎక్స్‌‌పెక్ట్‌‌ చేయొచ్చు. వెటరన్‌‌ ప్యాడ్లర్‌‌ శరత్‌‌ కమల్‌‌ ఐదోసారి పోటీల బరిలో నిలిచాడు. వయసు దృష్ట్యా ఇదే చివరిది కావొచ్చు. 16 ఏండ్ల తర్వాత సింగిల్స్‌‌లో తను మరో గోల్డ్‌‌ నెగ్గాలని కోరుకుంటున్నాడు. నాలుగేండ్ల కిందట  ఇండియా బాక్సర్లు తొమ్మిది పతకాలు రాబట్టారు. ఈ సారి అంతకుమించి పతక పంచ్‌‌ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. టోక్యోలో నిరాశ పరిచిన అమిత్‌‌ పంగల్‌‌ ఈ గేమ్స్‌‌లో గోల్డ్‌‌తో టచ్‌‌లోకి రావాలని చూస్తుండగా.. టోక్యో బ్రాంజ్‌‌ మెడలిస్ట్‌‌ లవ్లీనా బొర్గొహైన్‌‌తో పాటు వరల్డ్‌‌ చాంపియన్‌‌ నిఖత్‌‌ జరీన్‌‌ కూడా ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది.  నాన్‌‌ ఒలింపిక్స్‌‌ స్పోర్ట్స్‌‌లో స్క్వాష్‌‌ నుంచి కూడా  ఒకటి రెండు పతకాలు చూడొచ్చు.

హాకీ జట్లు పట్టుదలగా.. 

గోల్డ్‌‌కోస్ట్‌‌లో మెన్స్‌‌, విమెన్స్‌‌ హాకీ జట్లు నిరాశ పరిచాయి. దాంతో, ఈ సారి ఎలాగైనా పతకాలు సాధించాలని పట్టుదలగా ఉన్నాయి.  ఒలింపిక్స్‌‌లో బ్రాంజ్‌‌ నెగ్గిన మెన్స్‌‌, నాలుగో స్థానంతో మెప్పించిన విమెన్స్‌‌ టీమ్‌‌ అదే జోరును బర్మింగ్‌‌హామ్‌‌లోనూ కొనసాగించాలని చూస్తున్నాయి. 

అమ్మాయిల క్రికెట్‌‌పై ఆసక్తి

ఈ గేమ్స్‌‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన విమెన్స్‌‌ టీ20 క్రికెట్‌‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కామన్వెల్త్‌‌లో పెద్ద దేశాలైన ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌తో పాటు న్యూజిలాండ్‌‌, సౌతాఫ్రికాలో క్రికెట్‌‌కు మంచి పాపులారిటీ ఉంది. అందుకే క్రికెట్‌‌ మ్యాచ్‌‌ల టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి.