శ్రీలంకతో రెండో టీ20లో దుమ్ము రేపిన ఇండియా

శ్రీలంకతో రెండో టీ20లో దుమ్ము రేపిన ఇండియా

దంబుల్లా:  శ్రీలంకతో రెండో టీ20లోనూ ఇండియా విమెన్స్‌ టీమ్‌ దుమ్మురేపింది.  కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (31 నాటౌట్‌, 1/12) బ్యాట్‌, బాల్‌తో రాణించడంతో.. శనివారం జరిగిన రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 125/7 స్కోరు చేసింది. ఓపెనర్లు విష్మి గుణరత్నె (45), చామరి ఆటపట్టు (43) తొలి వికెట్‌కు 87 రన్స్‌ జోడించారు. అయితే 17వ ఓవర్‌లో కౌర్‌.. గుణరత్నెను ఔట్‌ చేయడంతో లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. హర్షిత (9), కావిషా (2), నీలాక్షి (1), హాసిని (0), ఒశాడి (5), అనుష్క సంజీవని (8 నాటౌట్‌), సుగంధిక (1 నాటౌట్‌) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇండియా బౌలర్లలో  దీప్తి 2, రేణుక, రాధా, పూజ తలా ఓ వికెట్‌ తీశారు.  తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 19.1 ఓవర్లలో 127/5 స్కోరు చేసి గెలిచింది. స్మృతి (39) రాణించినా, షెఫాలీ (17), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (17) ఓ మాదిరిగా ఆడారు. మిడిలార్డర్‌లో కౌర్‌ అండగా నిలిచింది. యాస్తిక భాటియా (13), దీప్తి శర్మ (5 నాటౌట్‌)తో కలిసి విజయాన్ని అందించింది. లంక బౌలర్లలో ఒశాడి, ఇనోకా చెరో రెండు వికెట్లు తీశారు. హర్మన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.