సంక్షోభ ఘంటికలు మోగించిన ట్రంప్.. మీరు కాదు.. హార్మూజ్ను మేమే మూసేస్తాం అంటూ ప్రకటన !

సంక్షోభ ఘంటికలు మోగించిన ట్రంప్.. మీరు కాదు.. హార్మూజ్ను మేమే మూసేస్తాం అంటూ ప్రకటన !

ఇదైతే నిజంగా ప్రపంచం సంక్షోభంలోకి కూరుకుపోయే ముందు మోగే ఘంటికలే. ఇన్నాళ్లు ప్రపంచ ఆయిల్, గ్యాస్ సరఫరాకు ఆయువు పట్టు అయిన హార్మూజ్ జలసంధిని  కంట్రోల్ చేస్తూ ఇరాన్.. అమెరికా తదితర దేశాలను ఆడిస్తూ వస్తోంది.  అయితే యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రతిపాదించిన  శాంతి చర్చలు విఫలమవ్వడంతో.. అమెరికా కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇన్నాళ్లు హార్మూజ్ ను మీరు మూసేస్తూ వస్తున్నారు.. ఇక మేము మూసేస్తాం.. అంటూ ట్రంప్ చేసిన ప్రకటనతో ప్రపంచ దేశాల గుండెల్లో పిడుగు పడినంత పనైందనే చెప్పాలి. 

హార్మూజ్ జలసంధి మీదుగా నౌకలను బ్లాక్ చేయాల్సిందిగా అమెరికా నావల్ ఫోర్స్ ను ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ అణు ప్రయత్నాలను విరమించుకోకుండా చర్చలు విఫలం చేసినందున.. అంతు చూసేవరకు వదలొద్దంటూ ఆదేశించారు. చర్చలు చాలా వరకు సానుకూలంగా సాగినా అణుకార్యక్రమాల విషయంలో ఇరాన్ బెట్టు చేసిందని.. అందుకే విఫలమయ్యాయని చెప్పారు. 

హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించడం లేదా వెళ్లడం అనేది లేకుండా పూర్తి స్థాయిలో మూసేసే ప్రక్రియను అమెరికా నేవీ ప్రారంభిస్తుందని తన  ట్రూత్ సోషల్ ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేశారు. ఏదైనా నౌకపైన ఇరాన్ దాడి చేసిన.. లేదంటే అమెరికా పైన దాడి చేసినా.. పేల్చేయడం తప్ప తమకు వేరే మార్గం లేదని అన్నారు. 

జలసంధిలో మైన్స్ ఉంచినట్లు ఇరాన్ ప్రకటించింది. వాటన్నింటినీ పేల్చేస్తాం.. ఇప్పటికే దాదాపు పేల్చేశాం అని అన్నారు. చర్చలు విఫలమైన సందర్భంగా అమెరికా నేవీ ఫోర్స్ హార్మూజ్ జలసంధికి సమీపంలోకి వెళ్లినట్లు చెప్పారు. అక్కడ మైన్లనన్నింటినీ క్లియర్ చేస్తామని చెప్పారు. 

 

►ALSO READ | షాకింగ్ వీడియో.. లెబనాన్ గ్రామాలను మ్యాపులో కూడా కనబడకుండా పేల్చేసిన ఇజ్రాయెల్..


పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో జరిగిన దాదాపు 20 గంటల చర్చల్లో అనేక అంశాలపై అంగీకారం కుదిరినా, ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో ఒప్పందానికి రాలేదని.. అన్నారు.  ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండదు.. అలా ఉండనివ్వమని హెచ్చరించారు.   హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచుతామని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, నౌకల మైన్ బెదిరింపుల వల్ల షిప్పింగ్ కార్యకలాపాలు ఆగిపోయాయని ట్రంప్ ఆరోపించారు. 

అక్రమ టోల్ చెల్లించే నౌకలను అడ్డుకుంటామని చెప్పారు. ఇరాన్ కు టోల్ చెల్లించే ఎవరికీ హై సీస్‌లో నుంచి దారి ఇవ్వం.. అంటూ హెచ్చరించారు.  ఇరాన్ చేస్తున్నది ప్రపంచ దోపిడీ అని అన్నారు ట్రంప్. అమెరికా లేదా ఇతర దేశాల  నౌకలపై ఇరాన్ ఎవరైనా కాల్పులు జరిపితే  నరకానికి పంపిస్తామంటూ  హెచ్చరిక జారీ చేశారు.ఈ బ్లాకేడ్‌లో ఇతర దేశాలు కూడా చేరవచ్చని ట్రంప్ సూచించారు. ఇరాన్ నేవీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇప్పటికే బలహీనపడ్డాయని.. ఈ టైమ్ లో ఇరాన్ పీచమణుస్తామని అన్నారు ట్రంప్.