
కొలంబో: విమెన్స్ ట్రై నేషన్స్ సిరీస్ ఫైనల్‌కు ఇండియా జట్టు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో లంక చేతిలో ఓడినా మిగతా మూడు మ్యాచ్‌ల్లో దుమ్మురేపిన టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉంది. ఇప్పుడు అదే జోరును కంటిన్యూ చేసి టైటిల్‌ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిరీస్‌లో గెలవడం ఇండియాతో పాటు లంకకు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు ఈ విజయం ఇచ్చే ఆత్మవిశ్వాసం పనికొస్తుందని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఈ సిరీస్‌లో ఇండియా బ్యాటింగ్‌కు తిగులేకుండా పోయింది.
సౌతాఫ్రికాపై సెంచరీ కొట్టిన జెమీమా రొడ్రిగ్స్ (201)తో పాటు ప్రతీక రావల్ (164), స్మృతి మంధాన (148), దీప్తి శర్మ (126) మంచి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో 41*, 30, 28 రన్స్ చేసింది. బౌలింగ్‌లోనూ ఇండియా మెరుగ్గానే ఉంది. స్నేహ్ రాణా 11 వికెట్లతో టాప్‌లో ఉంది. కశ్వీ గౌతమ్, అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ మెరిస్తే లంకను కట్టడి చేయడం చాలా ఈజీ. మరోవైపు గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిన లంకేయుల్లో ఆత్మవిశ్వాసం కొరవడింది. దీని నుంచి తొందరగా బయటపడి ఇండియాపై నెగ్గాలని భావిస్తున్నారు. స్టార్ బ్యాటర్ హర్షిత్ సమరవిక్రమ బ్యాటింగ్‌లో కీలకం కానుంది. చామిరి ఆటపట్టు, హాసిని పెరీరా, విష్మీ గుణరత్నే, అనుష్క సంజీవని చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు. బౌలింగ్‌లో దేవ్మి విహాంగ నుంచి ఇండియాకు ప్రమాదం పొంచి ఉంది. చామిరి, మానుడి కూడా అండగా నిలిస్తే రన్స్‌ను కట్టడి చేయొచ్చు.