
- భౌగోళిక చరిత్రలో ఉండాలనుకుంటారా? లేదా? అనేది పాక్ ఆలోచించుకోవాలి
- ఆపరేషన్ సిందూర్ సమయంలో కాస్త
- సహనాన్ని ప్రదర్శించినం
- ఈసారి అలా ఉండదు..
- రెచ్చగొడితే దెబ్బ తినాల్సిందే
- ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని సైన్యానికి పిలుపు
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు భారత్స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. టెర్రరిజాన్ని ప్రోత్సహించడం ఆపకుంటే ఆ దేశాన్ని ప్రపంచం పటంలో లేకుండా చేస్తామని హెచ్చరించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాస్త సహనాన్ని ప్రదర్శించామని, కానీ ఈసారి అలా ఉండదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు.
శుక్రవారం రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లో ఆర్మీ పోస్ట్‌ను ఉపేంద్ర ద్వివేది సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకుంటే ఆపరేషన్ సిందూర్ రెండో వెర్షన్ ఎంతో దూరంలో లేదని అన్నారు. ‘‘ఈసారి ఆపరేషన్సిందూర్1.0 లో ప్రదర్శించిన సహనాన్ని కొనసాగించం.
పాకిస్తాన్ భౌగోళికంగా తన స్థానాన్ని నిలుపుకోవాలనుకుంటున్నదా? లేదా? అని ఆలోచించేలా చేస్తం. మళ్లీ రెచ్చగొడితే.. సిందూర్ 2.0 దెబ్బ తినాల్సిందే. భౌగోళిక చరిత్రలో ఉండాలనుకుంటారా? లేదా? అనేది పాక్ ఆలోచించుకోవాలి. ప్రపంచ పటంలో ఉండాలనుకుంటే సీమాంతర ఉగ్రవాదాన్ని వెంటనే ఆపి తీరాల్సిందే. లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకుపోతారు జాగ్రత్త” అని హెచ్చరించారు.
దేవుడు కోరుకుంటే మరో అవకాశం
ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకైనా సైనికులు సిద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పిలుపునిచ్చారు. ‘‘దేవుడు కోరుకుంటే మీకు త్వరలోనే మరో అవకాశం రావొచ్చు.. ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమాయకుల ప్రాణాలకు హాని కలిగించకూడదని, సైనిక లక్ష్యాలను నాశనం చేయొద్దని నిశ్చయించుకున్నట్టు తెలిపారు. కేవలం పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు, వారి సూత్రధారులను నిర్మూలించడంపై దృష్టి సారించామని చెప్పారు.
భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రవాద స్థావరాల గురించి ప్రపంచానికి ఆధారాలు కూడా అందించామని చెప్పారు. అలా చేయకుంటే పాకిస్తాన్ సత్యాన్ని దాచిపెట్టి ఉండేదని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో అద్భుతంగా పనిచేసిన ముగ్గురు అధికారులను ఆర్మీ చీఫ్ ఈ సందర్భంగా సత్కరించారు.