Team India: గందరగోళంలో టెస్ట్ భవిష్యత్: కోహ్లీ, రోహిత్ వారసులు ఎవరు..? అందరి కళ్ళు వారిద్దరిపైనే

Team India: గందరగోళంలో టెస్ట్ భవిష్యత్: కోహ్లీ, రోహిత్ వారసులు ఎవరు..? అందరి కళ్ళు వారిద్దరిపైనే

భారత టెస్ట్ క్రికెట్ భవిష్యత్ గందరగోళంలో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు రిటైర్మెంట్ ప్రకటించడం షాకింగ్ కు గురి చేసింది. కనీసం టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా, రహానే అనుభవం లేకుండా పోయింది. వీరిద్దరినీ ఏడాది కాలంగా సెలక్టర్లు పట్టించుకోవడం మానేశారు. దీంతో భారత్ 15 ఏళ్ళ తర్వాత తొలిసారి పుజారా, రహానే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా టెస్ట్ క్రికెట్ ఆడనుంది. దశాబ్ద కాలం పాటు భారత జట్టుకు నాలుగు స్తంభాలుగా నిలబడిన వీరు ఇప్పుడు భారత టెస్ట్ క్రికెట్ కు దూరమయ్యారు. 

పుజారా, రహానే రీప్లేస్ మెంట్ వెతికే లోపు రోహిత్, కోహ్లీ వీడ్కోలు చెప్పేశారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి స్థానాలను భర్తీ చేసేదెవరనే ప్రశ్న ఎదురవుతుంది. ఓపెనర్ గా ఆడింది కొన్నేళ్లయినా టీమిండియా తరపున రోహిత్ బ్యాటింగ్ లో తన మార్క్ చూపించాడు. రెడ్ బాల్ క్రికెట్ లోనూ వేగంగా ఆడుతూ మంచి ఆరంభాలు ఇచ్చేవాడు. ఇప్పటివరకు రోహిత్‌శర్మ టెస్ట్ క్రికెట్ లో 67 టెస్టుల్లో 4,301 పరుగులు చేశాడు. వీటిలో 12 సెంచరీలు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

మరోవైపు టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ లోటును పూడ్చడం అంత సామాన్యమైన విషయం కాదు. సచిన్ తర్వాత పదేళ్ల పాటు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి దిగ్గజం లేని లోటు మరిపించాడు. ఓవరాల్ గా విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ ను ఒక్కసారి చూసుకుంటే.. 123 టెస్ట్ మ్యాచుల్లో 210 ఇన్నింగ్స్ ఆడాడు. 9230 పరుగులు చేశాడు. 31 హాఫ్ సెంచరీలు, 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. 

జైశ్వాల్, గిల్ పైనే అందరి ఆశలు:

ప్రస్తుతం టీమిండియా జట్టులో ఉన్న యశస్వి జైశ్వాల్, శుభమాన్ గిల్ టెస్ట్ భారాన్ని మోయాల్సి ఉంది. వీరిద్దరికీ ఇంకా చాలా భవిష్యత్ ఉంది. ఇప్పటికే ఓపెనర్ గా జైశ్వాల్ తనను తాను నిరూపించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో దిగ్గజాల రికార్డ్స్ ను బద్దలు కొట్టి సుదీర్ఘ ఫార్మాట్ లో దూసుకెళ్తున్నాడు. 23 ఏళ్ళ జైశ్వాల్ 19 టెస్టుల్లోనే 52 యావరేజ్ తో 1798 పరుగులు చేశాడు. దీంతో ఈ ముంబై యువ క్రికెటర్ పై భారత క్రికెట్ చాలానే అసలు పెట్టుకుంది. 

టీమిండియా ఫ్యూచర్ స్టార్ గా.. కోహ్లీ వారసుడిగా శుభమాన్ గిల్ ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. కోహ్లీ తర్వాత ఆ బాధ్యతలు గిల్ స్వీకరించాల్సి ఉంది. ఇప్పటికే వన్డే ఫార్మాట్ లో తనదైన మార్క్ చూపించిన ఈ పంజాబీ కుర్రాడు.. టెస్ట్ క్రికెట్ లో కాస్త తడబడుతున్నాడు. కోహ్లీ లేకపోవడంతో ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు కోహ్లీ ఆడుతున్న నాలుగో స్థానంలో గిల్ బరిలోకి దిగడం గ్యారంటీగా మారింది. 25 ఏళ్ళ గిల్ కు టెస్ట్ క్రికెట్ బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు సమాచారం. ఓ వైపు కెప్టెన్ గా.. మరోవైపు బ్యాటర్ గా గిల్ చాలా పెద్ద బాధ్యతనే మోయాల్సి ఉంది.