
ఇటీవల ఇండిగో విమానంలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా.. విమానాల్లో పవర్ బ్యాంకులు తీసుకెళ్లడంపై నిషేధం విధించే దిశగా అడుగులేస్తోంది DGCA. ఈ మేరకు అంతర్జాతీయ నిబంధనలను పరిశీలిస్తోంది. పవర్ బ్యాంకులను పూర్తిగా నిషేదించడమా.. లేక వాటి సామర్థ్యంపై పరిమితులు విధించడమా అన్న కోణంలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానంలో అగ్నిప్రమాదం జరిగిన క్రమంలో ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టిన డీజీసీఏ.. ఈ మేరకు కీలక నిర్ణయం దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ విమానాల్లో పవర్ బ్యాంకులను పూర్తిగా నిషేధిస్తే.. ప్యాసెంజర్స్ కి ఇబ్బంది ఎదురవ్వచ్చని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఫ్లైట్ క్యాబిన్ లో పవర్ బ్యాంకు కారణంగా జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువవుతున్న క్రమంలో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో డీజీసీఏ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పవర్ బ్యాంకులపై పూర్తి నిషేధం విధిస్తారా.. ?
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం రన్ వే పైకి వస్తున్న సమయంలో పవర్ బ్యాంక్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. పవర్ బ్యాంక్ పేలడం ద్వారానే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో విమానాల్లో పవర్ బ్యాంక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడం లేదా పవర్ బ్యాంక్ సామర్థ్యంపై పరిమితులు విధించే దిశగా సన్నాహాలు చేస్తోంది డీజీసీఏ. మరో పక్క భద్రతా ప్రమాణాలు పాటించని పవర్ బ్యాంకులను మాత్రమే నిషేదించే అంశంపై కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.