అమెరికాలో భారత సంతతి ఇంజినీర్​ మృతి

అమెరికాలో భారత సంతతి ఇంజినీర్​ మృతి
  • ట్రెక్కింగ్​కు వెళ్లి.. ఇంజినీర్ సహా ముగ్గురి దుర్మరణం

న్యూయార్క్: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ క్యాస్కేడ్స్ పర్వతారోహణకు వెళ్లిన నలుగురు అదుపుతప్పి 200 అడుగుల లోతులో పడిపోయారు. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన ఇంజినీర్ సహా ముగ్గురు మృతిచెందారు. గ్రేటర్ సియాటిల్ ప్రాంతంలోని పరీక్షా పరికరాల తయారీ సంస్థ అయిన ఫ్లూక్ కార్పొరేషన్‌‌లో భారత సంతతికి చెందిన ఇంజనీర్ విష్ణు ఇరిగిరెడ్డి(48) వైస్ ప్రెసిడెంట్‌‌గా పనిచేస్తున్నాడు. అతడు గత శనివారం తన ముగ్గురు స్నేహితులైన టిమ్ న్గుయెన్ (63), ఒలెక్సాండర్ మార్టినెంకో (36), ఆంటన్ త్సెలిక్ (38)తో కలిసి పర్వతారోహణ కోసం నార్త్ ఎర్లీ వింటర్స్ స్పియర్స్ ప్రాంతానికి వెళ్లారు.

 వారు అక్కడికి చేరుకోగానే తుఫాను రావడంతో వెనక్కి రావడం ప్రారంభించారు. కిందకి దిగే టైమ్​లో యాంకర్ పాయింట్ అదుపుతప్పి 200 అడుగుల లోతులో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆంటన్ త్సెలిక్ తప్ప మిగిలిన ముగ్గురూ మృతిచెందారు. ప్రాణాలతో బయటపడిన ఆంటన్ త్సెలిక్ 64 కి.మీ మేర నడిచి సురక్షిత ప్రాంతానికి చేరుకొన్నాడు. అనంతరం ప్రమాద విషయాన్ని అధికారులకు తెలిపాడు. రెస్క్యూ బృందాలు.. హెలికాప్టర్ సాయంతో డెడ్​బాడీలను బయటకు తీసుకువచ్చినట్టు తెలిసింది.