Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడ‌ల్‌.. ఎవరు ఇచ్చారంటే..?

Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడ‌ల్‌.. ఎవరు ఇచ్చారంటే..?

ఎట్టకేలకు భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌ మెడలోకి పసిడి పతకం వచ్చి చేరింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ పోరాటాన్ని మెచ్చి హ‌ర్యానా కాప్ పంచాయ‌తీ ఆమెను స్వ‌ర్ణ ప‌త‌కంతో స‌త్క‌రించింది. ఆదివారం ఆగస్టు 25న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఖాప్ పంచాయితీ సభ్యులు స్థానికంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఫొగాట్‌ చేత కేక్ కట్ చేయించి, మెడలో గోల్డ్‌ మెడల్‌ వేసి సత్కరించారు. 

అనర్హత వేటు

ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగాట్‌ అనర్హత వేటును ఎదుర్కొన్న విషయం విదితమే. ఆమె 50 కేజీల ఫ్రీ స్ట‌యిల్ రెజ్లింగ్‌ విభాగంలో పోటీపడగా.. ఫైన‌ల్‌కు కొన్ని గంటల ముందు 100 గ్రాములు అధిక బ‌రువు ఉందన్న కార‌ణంగా ఆమెపై అన‌ర్హ‌త వేటు వేశారు. దాంతో, భారత రెజ్లర్ చ‌రిత్ర సృష్టించే అవ‌కాశాన్ని కోల్పోయింది.

తనపై పడిన అన‌ర్హ‌త వేటును సవాల్ చేస్తూ భారత రెజ్లర్.. అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం(కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేష‌న్ ఫ‌ర్ స్పోర్ట్స్‌) ఆశ్రయించినా.. అక్కడా చుక్కెదురయ్యింది. ఒలింపిక్ క‌మిటీ, యునైటెడ్ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ తీసుకున్న నిర్ణ‌యాన్ని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేష‌న్ సమర్ధించింది. వారం రోజుల పాటు విచార‌ణ అనంతరం వినేశ్ అభ్య‌ర్థ‌న‌ను CAS కొట్టిపారేసింది.