
- ప్రపంచంలోనే ఎక్కువగా ఖర్చుచేస్తున్న భారతీయులు..!
- వచ్చే ఆదాయంలో 80 శాతానికి పైగా పిల్లల ఎడ్యుకేషన్
- సింగపూర్, దుబాయ్, లండన్, న్యూయార్క్ తో పోలిస్తే ఇక్కడ అధికం
- ఫీజుల భారంతో విలవిలలాడుతున్న
- మధ్య తరగతి కుటుంబాలు పదేండ్లలో 150–200 శాతం పెరిగిన ఫీజులు
న్యూఢిల్లీ : తల్లిదండ్రుల సంపాదనంతా పిల్లల చదువులకే పోతున్నది. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా పిల్లల చదువులకు ఖర్చు పెడ్తున్నది మన భారతీ యులే! వచ్చే ఆదాయంలో 80 నుంచి 90 శాతం దాకా ఎడ్యుకేషన్‌కే దారపోస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) లెక్కల్లో తేలింది. సింగపూర్, దుబాయ్, లండన్, న్యూయార్క్ పోలిస్తే.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మన నగరాల్లోని పేరెంట్స్ తమ సంపాదనలో భారీగా పిల్లల చదువులకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది.
అట్లనీ చదువు లేమైనా క్వాలిటీగా ఉంటున్నయా అంటే.. అదీ లేదు! మన దేశంలోని ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లు కూడా అంతంత మాత్రంగానే ఎడ్యు కేషన్ అందిస్తున్నాయి. పైగా పదేండ్లలో 150 నుంచి 200 శాతం ఫీజులు పెరిగాయి. పిల్లలను పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో చదివిస్తే.. వాళ్ల భవిష్యత్తు బాగుంటుందని అప్పుసప్పు చేసి పేరెంట్స్ఫీజులు కడ్తున్నా, పెద్దగా ఉపయోగం ఉండటం లేదని తేలింది. ఫీజుల భారం మధ్యతరగతి కుటుంబాలను ఆగం చేస్తున్నదని వెల్లడైంది.
ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందంటే..!
దేశ రాజధానిలో ఎడ్యుకేషన్ ఫీజులు అక్కడి ప్రజల ఆదాయం కంటే కూడా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఢిల్లీ ప్రజల ఆదాయం ఏడాదికి 12 నుంచి 15 లక్షలు కాగా.. వారి పిల్లలు చదివే స్కూల్ ఫీజులు మాత్రం ఏడాదికి ఏకంగా 12 నుంచి 20 లక్షలుగా ఉంది. అంటే వచ్చిన మొత్తం ఆదాయంలో స్కూల్ ఫీజుల కోసమే 80 నుంచి 130 శాతం పోతున్నది. ఏదైనా ఫంక్షన్, అనారోగ్యం వస్తే ఆయా కుటుంబాలు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది.
ఇక ముంబై పరిస్థితి కూడా ఇంచుమించు ఢిల్లీలాగే ఉంది. అక్కడి ప్రజలు ఏడాదికి 15 నుంచి 18 లక్షలు సంపాదిస్తున్నారు. అయితే, వారి పిల్లలు చదివే ప్రైవేట్ స్కూళ్లు ఏడాదికి 9 నుంచి 15 లక్షలు వసూలు చేస్తున్నాయి. అంటే ముంబై ప్రజలు తమ మొత్తం ఆదాయంలో స్కూల్ ఫీజుల కోసమే 50 నుంచి 85% ఖర్చు చేస్తున్నారు.
బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రముఖ సిటీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. స్కూల్ ఫీజులతో పాటు యూనిఫామ్‌లు, పుస్తకాలు, ట్రాన్స్‌పోర్ట్, టెక్ యాప్‌లు, ఎక్స్‌కర్షన్‌ల పేరుతో అదనంగా వసూల్ చేస్తున్నారు. ఇలా అడ్డూ అదుపులేకుండా ఫీజులు పెంచేస్తుండటంతో పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు సంపన్నులు కూడా ఆర్థిక భారంతో విలవిలలాడుతున్నారు.
విదేశీయుల ఆదాయం 5 రెట్లు ఎక్కువ
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లోని చిన్న స్కూల్ నుంచి ఎలైట్ ప్రైవేట్ స్కూళ్లలో చెల్లించే ఫీజులతో విదేశాల్లో నాణ్యమైన చదువులు చదువొచ్చు. మన స్కూళ్లలోని ఫీజులు.. ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు(అమెరికాలోని ఎనిమిది ప్రైవేట్ వర్సిటీలు, కాలేజీల సమూహం), యూరప్‌లోని బోర్డింగ్ స్కూళ్లు, సింగపూర్, దుబాయ్, లండన్, న్యూయార్క్‌లోని స్కూళ్లలో ఫీజులు సమానంగా ఉన్నాయి.
పైగా ఆయా దేశాల్లో యూనిఫామ్‌లు, పుస్తకాలు, ట్రాన్స్‌పోర్ట్ వంటివాటికి డబ్బులు వసూలు చేయట్లేదు. చిన్నారులకు ఫీజులకు తగినట్లు గ్లోబల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ అందిస్తారు. ఆయా నగరాల్లోని పేరెంట్స్ ఆదాయం భారతీయ కుటుంబాల కంటే 3 నుంచి 5 రెట్లు ఎక్కువ.
మనోళ్లు అప్పుసప్పు చేసి, కష్టార్జితమంతా దారబోసి ఫీజులు కడ్తున్నా.. పిల్లలకు స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ అందడం లేదు. మన దగ్గరున్న కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు.. రకరకాల ఫీజులతో దోచుకుంటున్నాయి. డెవలప్‌మెంట్ ఫీజని, యాక్టివిటీ చార్జీలని వసూళ్లకు దిగుతున్నాయి. పేరెంట్స్ కూడా బ్రాండ్ నేమ్ చూసి ఎంత అడిగితే అంతా కట్టేస్తుండటంతో వారిని ప్రోత్సహించినట్లు అయిపోతున్నది.