మాంసాహారం తింటే .. కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు వస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. మద్యం అలవాటు ఉన్నవారిలోనూ ఆ ముప్పు ఎక్కువే. మరి, శాకాహారులకూ ఆ ముప్పు ఎక్కువన్న సంగతి తెలుసా? అదీ దక్షిణాసియా వాసులు, భారతీయులే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారన్న విషయం తెలుసా? ‘మసాల’ రీసెర్చ్ అదే చెబుతోంది.
మహేంద్ర అగర్వాల్ తనకు హార్ట్ ఎటాక్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆయన వయసు 63 ఏళ్లు. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో పని చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం అమెరికాలోని శాన్ జోస్ లో ఉంటున్నారు. ఆయన వెజిటేరియన్. రోజూ కసరత్తులు చేస్తారు. బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ కూడా సాధారణంగానే ఉన్నాయి. అలాంటి వ్యక్తికి 2013 జూన్ లో సడన్ గా ఊపిరి అందలేదు. చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన బాధను చూసిన, వాళ్లావిడ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. టెస్టుల్లో గుండెకు రక్తాన్ని చేర్చే కరోనరి ధమనులు మూసుకుపోయాయని తేలింది. వెంటనే ఆపరేషన్ చేసి రెండు స్టెంట్లు వేయాలని డాక్టర్లు సూచించారు.
‘దక్షిణాసియా’ కారణం
మంచి అలవాట్లున్నా, అగర్వా ల్ గుండె జబ్బు బారిన పడటానికి కారణం ఆయనలో ‘దక్షిణాసియా’ మూలాలు ఉండటమేనట. అమెరికాలో ఏటా గుండె జబ్బులకు బలవుతున్న వారిలో దక్షిణాసియా మూలాలున్న వారే అత్యధికం. గుండె జబ్బుల చావుల్లో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు తదితర దక్షిణాసియా దేశాలకు చెందిన వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువని స్టాన్ ఫర్డ్ సౌత్ ఏషియన్ ట్రాన్స్ స్లేషనల్ హార్ట్ ఇనిషియేటివ్ లో కార్డియాలజిస్టుగా పని చేస్తున్న డా.అభా ఖండెల్వాల్ పేర్కొన్నారు. ఇతర దేశాల వారితో పోలిస్తే, దక్షిణాసియా దేశాల వాళ్లు పదేళ్ల ముందే గుండె సంబంధితజబ్బుల బారిన పడతారని చెప్పారు.
‘మసాల’ పరిశోధన
గుండె జబ్బులు దక్షిణాసియన్లకే ఎక్కువగా రావడంపై కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ‘మసాల’ ప్రాజెక్ట్ పేరిట రీసెర్చ్ చేస్తున్నాయి. షికాగో, బే ఏరియాల్లో నివసించే 900 దక్షిణాసియన్లు, దక్షిణాసియా మూలాలు కలిగిన వారిపై ఏడేళ్లుగా ఫోకస్ చేశాయి. బ్లడ్ ప్రెజర్, ట్రై గ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ వంటి జబ్బులకు దక్షిణాసియన్లు త్వరగా గురవుతారని ఈ రీసెర్చ్‌లో తేలింది. అంతేకాకుండా వీళ్ల కరోనరీ ధమనుల్లో కాల్షియం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఏ కారణం లేకుండా కొందరికి గుండెపోటు రావడానికి ఇదే కారణమని చెప్పారు. మసాలా రీసెర్చ్ లో బయటపడుతున్న ఫలితాలను పరిశీలించిన తర్వాత, అమెరి కన్ హార్ట్ అసోసియేషన్ కొత్త కొలెస్ట్రాల్ గైడ్ లైన్స్ రిలీ జ్ చేసింది. వీటిలో రోగుల పూర్వీకుల గురించి కూడా తెలుసుకోవాలని, డాక్టర్లకు సూచించింది.
స్కాన్స్ లో కొత్త కోణం
మసాలా రీసెర్చ్ కోసం వందలాది దక్షిణాసియన్లకు రీసెర్చర్లు స్కానింగ్ తదితర టెస్టులు చేశారు. శరీరంలో కొవ్వు పెరగకూడని చోటే, పెరుగుతున్నట్లు గుర్తించారు. లివర్, పొత్తి కడుపు, కండరాల్లో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతోందట. మళ్లీ వీళ్లందరి బాడీ మాస్ ఇండెక్స్ ‘సాధారణ వ్యక్తి ’లాగా ఉందని చెప్పారు. గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్న సౌత్ ఏసియన్లను మసాలా రీసెర్చర్లు రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఒకటి ఇప్పటికీ పూర్వీకుల సంప్రదాయాన్నే అనుసరిస్తున్న వారు. రెండు పూర్తిగా వెస్టర్న్ కల్చర్ కు మారిన వాళ్లు. అలాకాకుండా రెండింటిని సమతూకంగా పాటిస్తున్న వారు ఆరోగ్యంగా ఉంటున్నారని మసాలా రీసెర్చర్లు పేర్కొన్నారు.దక్షిణాసియా మూలాలున్న పిల్లలపై త్వరలో మసాలా రీసెర్చ్‌ను మొదలుపెట్టబోతున్నట్లు నార్త్ వెస్టర్న్ వర్సిటీకి చెందిన డా. కందుల నమ్రత చెప్పారు. పెద్దలు పాటించే లైఫ్ స్టైల్ కే పిల్లలూ అలవాటు పడతారు కాబట్టి, వాళ్లపైనా పరిశోధనలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

