శత్రుదేశాలు సవాల్ చేస్తే.. దేనికైనా రెడీ: రాజ్ నాథ్ సింగ్

శత్రుదేశాలు సవాల్ చేస్తే.. దేనికైనా రెడీ: రాజ్ నాథ్ సింగ్
  • భారత్ ఇప్పుడు బలహీన దేశం కాదు: రాజ్ నాథ్ సింగ్  
  • మన బలగాలు దీటుగా బదులిస్తాయి
  • ఎన్డీటీవీ డిఫెన్స్​ సమిట్​లో రక్షణశాఖ మంత్రి స్పష్టీకరణ 

న్యూ ఢిల్లీ: భారత్ ఇప్పుడు​ బలహీన దేశం కాదని, దేశ సరిహద్దుల్లో సవాళ్లు ఏరూపంలో ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నదని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు. భూమి, గగనతలం, సముద్రం నుంచి ఎవరైనా దాడిచేస్తే మా బలగాలు దీటుగా బదులిస్తాయని వెల్లడించారు. గురువారం ఆయన ఎన్డీటీవీ డిఫెన్స్​ సమిట్​లో మాట్లాడారు. ఎల్లవేళలా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని.. శాంతి సమయంలోనూ సంసిద్ధంగా ఉండాలని ఆర్మీకి చెప్పామన్నారు. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్​నాథ్​ సింగ్​ ఈ వ్యాఖ్యలు చేశారు. మనం ఏ దేశంపైనా దాడి చేయలేదని, ఏ దేశ భూమిని ఇంచు కూడా ఆక్రమించుకోలేదని చెప్పారు. కానీ ఎవరైనా మనపై దాడికి దిగితే గట్టి సమాధానం చెప్పేందుకు సిద్ధమని వెల్లడించారు. గల్వాన్​లో చైనా బలగాలతో చోటుచేసుకున్న ఘర్షణలో భారత సైనికుల తెగువను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్​ బలహీనం దేశం కాదని, ఎవరినైనా ఎదుర్కొనే సత్తా మనకున్నదని స్పష్టం చేశారు. 
ప్రధాని మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ రంగంలో  ఆత్మనిర్భర్​ భారత్​పై దృష్టి పెట్టామని, రక్షణరంగం బలోపేతానికి కృషిచేస్తున్నట్టు చెప్పారు. 

లక్ష్యాల కోసం ఎంతకైనా సిద్ధం: ఆర్మీ చీఫ్​

ప్రపంచ భౌగోళిక, రాజకీయ దృశ్యాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయని, నేడు దేశాలన్నీ ఎంత కఠినమైన శక్తినైనా వినియోగించేందుకు సంసిద్ధతను చూపుతున్నాయని భారత ఆర్మీ చీఫ్​ మనోజ్​ పాండే వెల్లడించారు. ఎన్డీటీవీ డిఫెన్స్​ సమిట్​లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘అంతర్జాతీయ వ్యవస్థలో జాతీయ ప్రయోజనాలు, జాతీయ భద్రతకు పెరుగుతున్న ప్రాధాన్యం కనిపిస్తున్నది. నేడు దేశాలు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు, రాజకీయ, సైనిక లక్ష్యాలను సాధించేందుకు ఎంతకైనా సిద్ధపడుతున్నాయి. సాంప్రదాయ యుద్ధవిధానం మారినప్పటికీ.. మోడ్రన్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే సొంతం కాదు. విఘాతం కలిగించే సాంకేతిక అనేది యుద్ధరీతినే మార్చేస్తున్నది’ అని వ్యాఖ్యానించారు.