జీడీపీ 7.8 శాతం జంప్..10 శాతం పెరిగిన తయారీ రంగం

జీడీపీ 7.8 శాతం జంప్..10 శాతం పెరిగిన తయారీ రంగం
  • గత మూడో క్వార్టర్లో 7.4 శాతం
  • 10 శాతం పెరిగిన తయారీ రంగం
  • ఇక నుంచి 2022-23  బేస్ ఇయర్

న్యూఢిల్లీ: మనదేశ ఆర్థిక వ్యవస్థ 2025–26  మూడో క్వార్టర్ (అక్టోబర్‌‌‌‌–డిసెంబర్‌‌‌‌) లో 7.8 శాతం వృద్ధి సాధించిందని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. గత మూడో క్వార్టర్లో 7.4 శాతం పెరిగింది. ఈసారి పారిశ్రామిక రంగం బలమైన పనితీరు, స్థిరమైన వినియోగ ధోరణులతో ఎకానమీ బలంగా ఉంది.

 సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో నమోదైన 8.4 శాతం వృద్ధి నుంచి ఇది స్వల్పంగా తగ్గినా ప్రపంచ అనిశ్చితుల మధ్య దేశీయ డిమాండ్ బలంగా ఉంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) 2022–-23 బేస్ ఇయర్‌‌‌‌గా కొత్త జీడీపీ సిరీస్‌‌ను ప్రవేశపెట్టింది. తయారీ రంగం పది శాతానికి పైగా వృద్ధిని సాధించి ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించింది. 

ద్వితీయ రంగంలోని తయారీ, నిర్మాణం, విద్యుత్ రంగాలు బలంగా ఉన్నాయి. నిర్మాణ రంగం వృద్ధి రేటు గతంలోని 8.7 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గింది. ప్రైవేట్ వినియోగ వ్యయం ఆరోగ్యకరమైన వేగంతో పెరగడం వల్ల గృహ వినియోగ డిమాండ్ పెరుగుతోంది. వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్ హోటల్ రంగాలు బాగున్నాయి.  ఈసారి జీఎస్టీ, ఈ–వాహన్​ వివరాలనూ జీడీపీ లెక్కల్లో చేర్చారు. 

నెమ్మదించిన సాగు, మైనింగ్ ​రంగాలు

వ్యవసాయం, మైనింగ్ రంగాలు మందగించినా తయారీ రంగం వరుసగా ఐదో క్వార్టర్‌‌‌‌లోనూ రెండంకెల వృద్ధి సాధించడం గమనార్హం. సేవల రంగం జీవీఏ వృద్ధి 9.5 శాతానికి చేరి ఏడు క్వార్టర్ల గరిష్టాన్ని తాకింది. 2026 రెండో ముందస్తు అంచనా 7.6 శాతంగా ఉంది. ఇది 2025 నాటి 7.1 శాతం కంటే ఎక్కువే. కొత్త బేస్ ఇయర్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పాత అంచనాల కంటే కాస్త తక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 2024, 2025 ఆర్థిక సంవత్సరాల నామినల్ జీడీపీ పాత సిరీస్ కంటే 3.8 శాతం తక్కువగా ఉంది. 

దీనివల్ల జీడీపీలో ద్రవ్యలోటు నిష్పత్తి 15 నుంచి 20 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. 2027 ద్రవ్యలోటు లక్ష్యం 4.3 శాతం నుంచి 4.46 శాతానికి మారవచ్చని ఇక్రా ఎనలిస్టు అదితి నాయర్  అభిప్రాయపడ్డారు. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి అప్పుల జీడీపీ నిష్పత్తి 55.6 శాతం బదులు 57.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు.  నాలుగో క్వార్టర్‌‌‌‌లో వృద్ధి 7.3 శాతానికి తగ్గే అవకాశం ఉన్నా, ఇది ఆరోగ్యకరమైన వృద్ధి అని ఆమె విశ్లేషించారు.  

వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 20 బేసిస్ పాయింట్లు పెంచి ఏడు నుంచి 7.4 శాతానికి మార్చాం. జీడీపీ వచ్చే ఏడాదిలో రూ. 336 లక్షల కోట్లు మార్కును దాటుతుంది. స్థిరమైన పెట్టుబడులు, బలమైన దేశీ డిమాండ్​ ఇందుకు కారణం. ఈ వృద్ధి రేటు వల్ల భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుంది.

- ముఖ్య ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్