భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నప్పటికీ, వంటగ్యాస్ (ఎల్‌పీజీ) వంటి ప్రాథమిక ఇంధన అవసరాల విషయంలో విదేశీ దిగుమతులపై అధికంగా ఆధారపడటం ఒక ఆందోళనకర విషయం. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి ‘హార్మూజ్ జలసంధి’ మార్గంలో సరఫరా అంతరాయం ఏర్పడే ప్రమాదం తలెత్తుతోంది. ఈ పరిస్థితి మన దేశ ఇంధన భద్రత ఎంత నాజూకుగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో దేశం ఇంధన స్వావలంబన దిశగా గట్టిగా అడుగులు వేయాలంటే బయోగ్యాస్, సోలార్ విద్యుత్ వంటి వ్యవస్థలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం అత్యవసరం.
ప్రస్తుతం భారత్ ఎల్‌పీజీ అవసరాల కోసం ఏడాదికి లక్ష కోట్ల రూపాయలకుపైగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది. దీనికితోడు ప్రభుత్వంపై వేల కోట్ల రూపాయల సబ్సిడీ భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినా, యుద్ధాలు జరిగినా, రవాణా మార్గాలు దెబ్బతిన్నా మొదట ప్రభావం పడేది సాధారణ ప్రజలపైనే. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కూడా. దేశం తన ప్రాథమిక అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడటం ఎప్పటికీ సరైన పరిష్కారం కాదు.
ప్రతి గ్రామం శక్తి కేంద్రం
దేశీయంగా మనకు లభించే వనరులను వినియోగించుకోవడం సమస్య పరిష్కారానికి అత్యంత సమర్థవంతమైన మార్గం. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 20 కోట్ల పశుసంపద నుంచి లభించే పేడ, పంట అవశేషాలు, వంటింటి వ్యర్థాలు.. ఇవన్నీ కలిసి ఒక విశాలమైన ఇంధన వనరుగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు విస్తృతంగా ఉన్న బయోగ్యాస్ ప్లాంట్లు సరైన విధానపరమైన ప్రోత్సాహం లేకపోవడంతో నేడు కనుమరుగవుతున్నాయి. అయితే ఈ వనరులను మళ్లీ సక్రమంగా వినియోగించగలిగితే ప్రతి గ్రామం ఒక చిన్న శక్తికేంద్రంగా మారే అవకాశం ఉంది. బయోగ్యాస్ వినియోగం కేవలం వంట ఇంధన సమస్యకు పరిష్కారం మాత్రమే కాదు. ఇది వ్యవసాయ రంగానికీ గొప్ప మద్దతును అందిస్తుంది. బయోగ్యాస్ ప్లాంట్ల నుంచి వచ్చే స్లరీ సేంద్రియ ఎరువుగా పనిచేసి భూమిసారాన్ని పెంచుతుంది. దీనిద్వారా రైతులు రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా వ్యవసాయ ఖర్చులు తగ్గడమే కాకుండా, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇదే సమయంలో పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. వ్యర్థాలను సమర్థంగా వినియోగించడం ద్వారా గ్రామీణ పరిశుభ్రత కూడా మెరుగవుతుంది.
బయోగ్యాస్‌పై అవగాహన కల్పించాలి
అయితే ఇంతటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా కేవలం 0.3 శాతం కుటుంబాలే బయోగ్యాస్‌ను వంట కోసం ఉపయోగిస్తున్నాయి అనే గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనకబడి ఉండటం మరింత విచారకరం. ఇది ప్రజల్లో అవగాహన లోపం, విధానపరమైన అమలు బలహీనత, స్థానిక నాయకత్వం కొరత వంటి అంశాలను ప్రతిబింబిస్తుంది. కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రకటించడం సరిపోదు. బయోగ్యాస్‌పై అవగాహన కల్పించాలి.
వాటిని గ్రామస్థాయిలో అమలుచేసే వ్యవస్థ బలపడాలి. ఈ మార్పు గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభం కావాలి. సర్పంచులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంఘాలు కలిసి బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాన్ని ఒక సామూహిక ఉద్యమంగా మార్చాలి. ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చినట్లే బయోగ్యాస్ కేంద్రాల ఏర్పాటు విషయంలో ముందుండే గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.
గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం
గ్రామీణ యువతకు ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణ, మరమ్మతులలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఇది గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసే దిశలో కీలక అడుగుగా మారుతుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుకింగ్ వ్యవస్థలు, ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వంటి చర్యలు వంటగ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించగలవు. ఇటీవల ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన తక్కువ ఖర్చుతో కూడిన సోలార్ కుక్కర్ వంటి ఆవిష్కరణలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తే, ఇంధన వినియోగంలో ఒక పెద్ద మార్పు తీసుకురాగలవు.
ప్రభుత్వం ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాలను విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇంధన స్వావలంబన అనేది కేవలం ఒక అభివృద్ధి లక్ష్యం మాత్రమే కాదు. అది దేశ భవిష్యత్తును నిర్ణయించే వ్యూహాత్మక అవసరం. ప్రతి గ్రామం తన వంట అవసరాలను తానే తీర్చుకునే స్థాయికి చేరుకుంటే, దేశం విదేశీ దిగుమతులపై ఆధారపడే పరిస్థితి గణనీయంగా తగ్గుతుంది. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయాభివృద్ధి, గ్రామీణ ఉపాధి.. ఇవన్నీ సమగ్రంగా ముందుకు సాగుతాయి.
అందుకే బయోగ్యాస్, సోలార్, విద్యుత్ వంట వ్యవస్థలను ఒక సమగ్ర జాతీయ ఉద్యమంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. వంటగది నుంచి ప్రారంభమయ్యే ఈ మార్పు దేశ ఆర్థిక స్వాతంత్ర్యానికి, పర్యావరణ సమతుల్యతకు, గ్రామీణ అభివృద్ధికి ఒక శక్తిమంతమైన పునాది అవుతుంది. ప్రతి ఇంటి వంట పొయ్యి స్వావలంబన వైపు మళ్లినప్పుడే భారతదేశం నిజమైన శక్తి సమృద్ధి దేశంగా ఎదుగుతుంది.
- మేకల క్రిష్ణ,
ప్రధాన కార్యదర్శి,తెలంగాణ జర్నలిస్టుల ఫోరం
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
