మరికొన్ని రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో పండుగ వాతావరణంతో సందడి మొదలు కాబోతున్నది. అస్సాం ప్రజలు రొంగాలి బిహు జరుపుకుంటే, ఒడిశా ప్రజలు మహా బిషుబ పాన సంక్రాంతి నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో పొయిలా బైశాఖ్ బెంగాలీల నూతన సంవత్సరానికి నాంది పలికితే.. కేరళలో సంబరంగా విషు పండగ నిర్వహిస్తారు.
తమిళనాడులో పుత్తాండు పర్వదినాన్ని, పంజాబ్ సహా ఉత్తర భారతంలోని ఇతర ప్రాంతాల్లో బైశాఖీ వేడుకను చేసుకుంటారు. ఇవన్నీ ఆశాభావాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి. దేశవిదేశాల్లో ఈ వేడుకలను నిర్వహించుకునేవారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్ర ఉత్సవాలు అందరి జీవితాల్లోనూ ఆనందాన్నీ, సౌభాగ్యాన్నీ తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.
ఏప్రిల్ 11 నుంచి మహాత్మా ఫూలే 200 జయంత్యుత్సవాలను మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు యావత్ భారతదేశం నివాళి అర్పిస్తుంది. ఈ ప్రత్యేక సందర్భాలే కాకుండా, మన హృదయాలూ, ఆలోచనలూ పునర్నవీకరణ స్ఫూర్తితో నిండిన వేళ.. మన దేశం మరో చారిత్రక విజయం ముంగిట నిలబడింది. ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్టం చేసుకోవడానికి, సమానత్వం, సమ్మిళితత్వం దిశగా మన సమష్టి నిబద్ధతను పునరుద్ఘాటించడానికి లభించిన గొప్ప అవకాశమిది.
కోట్లాది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబం
మహిళల రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లే ముఖ్యమైన బిల్లుపై చర్చించేందుకు, ఆమోదించేందుకు ఏప్రిల్ 16న పార్లమెంటు సమావేశం కానుంది. దీనిని ఓ శాసనపరమైన కార్యక్రమంగా పేర్కొంటే ఈ బిల్లు ప్రాధాన్యాన్ని తగ్గించినట్టే అవుతుంది. భారత్‌లోని కోట్లాది మహిళల ఆకాంక్షలకు ఇది ప్రతిబింబం. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే సమాజం పురోగమిస్తుందనే మన సుదీర్ఘ నాగరికతా స్ఫూర్తికి ఇది నిదర్శనం. దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే. ఈ దేశానికి వారు అందిస్తున్న సేవలు అపారమైనవి. అమూల్యమైనవి.
ప్రతిరంగంలోనూ మహిళలు సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు నేడు భారత్ కేంద్రంగా మారింది. శాస్త్ర, సాంకేతిక రంగాల నుంచి ఔత్సాహిక పారిశ్రామిక రంగం వరకు, క్రీడల నుంచి రక్షణ బలగాల వరకు, సంగీతం నుంచి కళల వరకు దేశాభివృద్ధిలో మహిళలే అగ్రగామిగా ఉన్నారు. కొన్నేళ్లుగా చేసిన ప్రయత్నాలు స్త్రీ సాధికారత దిశగా అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. చదువుకునేందుకు విస్తృతంగా పెరిగిన అవకాశాలు, మెరుగైన ఆరోగ్యసేవలు, విస్తరించిన ఆర్థిక సమ్మిళితత్వం, అందుబాటులోకి వచ్చిన ప్రాథమిక అవసరాలు... ఆర్థిక, సామాజిక కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని విస్తృతం చేశాయి. అయినప్పటికీ.. సమాజంలో మహిళలు పోషిస్తున్న పాత్రకు అనుగుణంగా రాజకీయ రంగంలో, శాసనసభల్లో వారికి ప్రాతినిధ్యం లభించలేదు. ఇది దురదృష్టకరం.
పరిపాలనలో మహిళలు భాగస్వాములైతే..
పరిపాలనలో, నిర్ణయాధికారంలో మహిళలు భాగస్వాములైతే.. వారిదైన ఆలోచనలనూ, అనుభవాలనూ జోడించడం ద్వారా ప్రజోపయోగ చర్చలు, పాలనా సామర్ధ్యం మరింత మెరుగవుతాయి. రానున్న అంటే... 2029లో లోక్‌సభ, వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగే నాటికి మహిళా రిజర్వేషన్లను అమలుచేయడం అనివార్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు దక్కాల్సిన ప్రాధాన్యాన్ని అందించేందుకు గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చాయి. కమిటీలు ఏర్పాటయ్యాయి. ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. అయినప్పటికీ... చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న అంశంలో విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. ఈ ఏకాభిప్రాయ స్ఫూర్తితోనే 2023 సెప్టెంబరులో నారీ శక్తి వందన్ అధీనియంను పార్లమెంటు ఆమోదించింది.
నా జీవితంలోని అత్యంత ప్రత్యేకమైన సందర్భాల్లో ఒకటిగా నేను దీనిని భావిస్తాను. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఈ అవకాశం మన రాజ్యాంగ స్ఫూర్తిలో ప్రతిధ్వనిస్తోంది. ఆచరణాత్మక రూపంలో సమానత్వానికి ప్రాతినిధ్యం ఉన్న సమాజాన్ని నిర్మించాలని మన రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. ఈ ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగా చేపడుతున్న ప్రయత్నాల్లో ప్రధానం... శాసనవ్యవస్థల్లో మహిళల పాత్రను బలోపేతం చేయడం. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రతి పౌరునికీ సమాన భాగస్వామ్యాన్ని అందించే సమాజాన్ని నిర్మించడంలో మా చిత్తశుద్ధిని ఇది ప్రతిబింబిస్తుంది.
శాసన వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాలి
ఉపేక్షకు అవకాశం లేని సమయం వచ్చింది. మహిళల ప్రాతినిధ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి జాప్యం జరిగినా.. ప్రజాస్వామ్య సమ్మిళితత్వాన్నీ, ప్రజాస్వామ్య స్ఫూర్తినీ మనం వాయిదా వేసినట్లే. శాసన వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని దశాబ్దాల కిందటే గుర్తించారు. ఈ అంశంపై చర్చించారు. ఇలా చేయడం తప్పనిసరి అని కూడా భావించారు. ఇప్పుడు గనుక దీనిని వాయిదా వేస్తే.. మనం గుర్తించిన, సరిదిద్దగలిగిన అసమతౌల్యాన్ని మరింత పెంచడమే అవుతుంది.
నిర్దిష్ట లక్ష్యంతో, ఆత్మవిశ్వాసంతో భారత్ ముందుకు సాగుతున్న ఈ తరుణంలో ప్రజలు, ముఖ్యంగా జనాభాలో సగ భాగంగా ఉన్నవారి ఆకాంక్షలను మన శాసన వ్యవస్థలు ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది. సకాలంలో చేపట్టే చర్యలు దీర్ఘకాలంగా నెరవేరని వాగ్దానాలను నెరవేర్చడమే కాకుండా ప్రగతి వేగాన్ని సైతం కొనసాగిస్తాయి. మన ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రాతినిధ్యం కల్పించేదిగా, స్పందించేదిగా, భవిష్యత్తుకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఇది నిజంగా చరిత్రాత్మకమైన అవకాశం. అందరూ కలిసి రావాల్సిన సమయం. ఇది ఏ ఒక్క ప్రభుత్వానికో, పార్టీకో లేదా వ్యక్తికో సంబంధించిన అంశం కాదు. దీని ప్రాధాన్యాన్ని గుర్తించి, దీనిని సాకారం చేసుకునే దిశగా దేశమంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇది. మన నారీశక్తి బలోపేతానికి మనం అందించాల్సింది ఇదే.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు లభించే ఆమోదంలో విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తం కావాలి. జాతీయ ప్రయోజనాలే పరమావధి కావాలి. మనకోసం కాకుండా భవిష్యత్తు తరాల కోసం పనిచేయాలనే స్ఫూర్తిని ఇలాంటి అవకాశాలు మనకు అందిస్తాయి. మార్పులను స్వీకరిస్తూ, మరింత సమ్మిళితత్వాన్ని సాధించడంలోనే అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి దాగి ఉందన్న సంగతిని గుర్తు చేస్తున్నాయి.
చరిత్రాత్మకమైన ఈ పార్లమెంటు సమావేశం సమీపిస్తున్న నేపథ్యంలో.. భారతీయ మహిళల కోసం చేపడుతున్న ఈ ముఖ్యమైన కార్యక్రమానికి మద్దతు అందించాలని పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బాధ్యతగా వ్యవహరించేందుకూ, ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ముందుకు వద్దాం. అత్యున్నత ప్రజాస్వామ్య విలువల కోసం కలిసి నడుద్దాం. జాతీయ ప్రయోజనాల విషయంలో విభేదాలను పక్కనపెట్టి, ఐక్యంగా వ్యవహరించగలదని భారత్ ఎల్లప్పుడూ రుజువు చేస్తూనే ఉంది. ఇది అలాంటి సందర్భమే. అందరం కలసికట్టుగా ముందుకు సాగుదాం. రాజ్యాంగ విలువలను బలోపేతం చేద్దాం. దేశ ప్రగతి కోసం నారీశక్తికి సాధికారత కల్పిద్దాం.
- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
