Vasudheva Sutham Trailer: వీఎఫ్‌ఎక్స్, భారీ యాక్షన్‌తో ‘వాసుదేవ సుతం’.. రిలీజ్ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్!

Vasudheva Sutham Trailer: వీఎఫ్‌ఎక్స్, భారీ యాక్షన్‌తో ‘వాసుదేవ సుతం’.. రిలీజ్ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్!

మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వాసుదేవ సుతం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి సంబంధించి మూవీ టీం ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది. లేటెస్ట్గా విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బదర్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచగా, తాజాగా విడుదలైన ఫైనల్ ట్రైలర్ యాక్షన్, ఎమోషన్, ఆధ్యాత్మిక అంశాల మేళవింపుతో ఆకట్టుకుంటోంది.

ట్రైలర్‌లోని పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తప్పులకు క్షమించడం గొప్పదే అయినా, ప్రతి తప్పును క్షమించడం కూడా తప్పేననే భావనతో కథ సాగుతుంది. దేవుడి ఉనికిని సవాల్ చేసే దుష్ట శక్తులకు వ్యతిరేకంగా హీరో చేసే పోరాటమే ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది.

అన్యాయం, చెడు శక్తులు హద్దులు దాటినప్పుడు ధర్మాన్ని కాపాడేందుకు దైవ శక్తి ఒక రూపంలో వస్తుందనే కాన్సెప్ట్ చుట్టూ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ సూచిస్తోంది. కీలక యాక్షన్ సన్నివేశాల్లో మహేంద్రన్ పాత్ర ఉగ్రరూపంలో కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి శక్తిని గుర్తు చేసేలా ఆ సన్నివేశాలను రూపొందించారు.

సినిమా విజువల్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘పార్కింగ్’ సినిమాతో గుర్తింపు పొందిన సినిమాటోగ్రాఫర్ జిజు సన్నీ అందించిన కెమెరా పనితనం ప్రత్యేకంగా కనిపిస్తోంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత బలాన్ని ఇచ్చింది.

అజయ్ భూపతి ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రబృందాన్ని అభినందించారు. స్టోరీ, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. ఇప్పటికే సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది.

ఈ సినిమాలో జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్ చంద్ర మీనన్, ఐశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆధ్యాత్మికత, యాక్షన్, భావోద్వేగాల కలయికగా ‘వాసుదేవ సుతం’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.