- డెడ్‌లైన్‌కు 90 నిమిషాల ముందు ప్రకటించిన ట్రంప్
- సీజ్‌ఫైర్ చేసుకోవాలని ట్రంప్‌ను, హార్మూజ్‌ను తెరవాలని ఇరాన్‌ను ట్యాగ్ చేస్తూ పాక్ ప్రధాని ‘ఎక్స్’లో పోస్ట్
- వైట్‌హౌస్‌లో క్లోజ్డ్ డోర్ మీటింగ్
- పాక్ ప్రధానితో మాట్లాడాక కాల్పుల విరమణ నిర్ణయం.. అనంతరం
- ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్
- రెండు వారాల సీజ్‌ఫైర్‌కు ఇరాన్ సైతం అంగీకారం.. తమ దేశంపై దాడులు పూర్తిగా ఆగితేనే అని కండీషన్
- తమ సాయుధ బలగాల సమన్వయంతో హార్మూజ్ గుండా నౌకల రాకపోకలకు అనుమతిస్తున్నట్టు ప్రకటన
- యుద్ధానికి ఇది ముగింపు కాదన్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా
- తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయంటూ కామెంట్
- తక్షణమే కాల్పులు నిలిపేయాలని అన్ని సైనిక విభాగాలకు ఆర్డర్
టెహ్రాన్/ వాషింగ్టన్: ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తానని తీవ్ర హెచ్చరికలు చేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఇరాన్‌పై యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, ఇరాన్ పంపిన 10 సూత్రాల ప్రతిపాదనలతో మెత్తబడ్డ ఆయన సీజ్‌ఫైర్‌కు ఓకే చెప్పారు. ఈ మేరకు డెడ్‌లైన్‌కు 90 నిమిషాల ముందు బుధవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. హార్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి ఇరాన్‌కు 2 వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు అంగీకరించానని ప్రకటించారు. ఇది ‘ఇరువైపులా కాల్పుల విరమణ’ అని తెలిపారు. ఆ 10 పాయింట్ల ప్రతిపాదనలు చర్చలు జరపడానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఇరాన్ మొత్తం నాశనం చేస్తానన్న ట్రంప్ ప్రకటనలు.. వెనక్కి తగ్గేదే లేదన్న ఇరాన్ తెగింపుతో తెల్లారేసరికి ఏం జరుగుతుందోనన్న కలవరపడ్డ ప్రపంచం ఊపిరి పీల్చుకున్నది.
డెడ్‌లైన్ ముగిసేలోపే కుదిరిన ఒప్పందం..
హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంపై భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటల లోపు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ నాగరికత మొత్తం తుడిచేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
అయితే, ఈ సమయంలోనే ఇరాన్, అమెరికా మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది. రెండువారాలపాటు సీజ్‌ఫైర్ చేసుకోవాలని ట్రంప్‌ను, హార్మూజ్‌ను తెరవాలని ఇరాన్‌ను ట్యాగ్ చేస్తూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టారు. మరోవైపు అమెరికాకు10 పాయింట్ల కండీషన్లను మధ్యవర్తుల ద్వారా ఇరాన్ చేరవేసింది. ఆ వెంటనే వైట్‌హౌస్ భవనంలో క్లోజ్డ్ డోర్ మీటింగ్ నిర్వహించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో మాట్లాడిన తర్వాత.. డెడ్‌లైన్‌కు సరిగ్గా 90 నిమిషాల ముందు ట్రంప్ సీజ్‌ఫైర్ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇరాన్ ప్రభుత్వం వెంటనే హార్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో, సురక్షితంగా తెరిచేందుకు అంగీకరించిన నేపథ్యంలో.. రెండు వారాల పాటు ఇరాన్‌పై బాంబు దాడులను, ఇతర అటాక్స్‌ను నిలిపివేసేందుకు అంగీకరించినట్టు పేర్కొన్నారు. ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక ‘ఆచరణాత్మకమైనది’ అని పేర్కొన్నారు.
సైనిక లక్ష్యాలు సాధించినం
అమెరికా ఇప్పటికే తన సైనిక లక్ష్యాలను అనుకున్నదానికంటే ఎక్కువే సాధించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్, పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతిని నెలకొల్పే దిశగా తాము చాలా ముందుకెళ్లామని అన్నారు. ఇరాన్ నుంచి 10 అంశాలతో కూడిన ప్రతిపాదన అందిందని, చర్చలు జరిపేందుకు ఇది ఒక మంచి ప్రాతిపదిక అని అభిప్రాయపడ్డారు.
గతంలో ఉన్న అనేక వివాదాస్పద అంశాలపై ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరిందని, ఈ రెండు వారాల సమయం తుది ఒప్పందానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ 14 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడిగా, పశ్చిమాసియా దేశాల ప్రతినిధిగా ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి దగ్గరవ్వడం గౌరవంగా భావిస్తున్నానని తన సందేశంలో పేర్కొన్నారు.
మాదే విజయం: ఇరాన్
మరోవైపు సీజ్‌ఫైర్‌ను ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చరిత్రాత్మక విజయంగా అభివర్ణించింది. తాము ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రణాళికను అమెరికా అంగీకరించిందని, అందుకే యుద్ధం ఆగిందని పేర్కొన్నది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ధ్రువీకరించారు. అయితే, తమపై జరుగుతున్న దాడులు పూర్తిగా ఆగితేనే తాము ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
వచ్చే రెండు వారాల పాటు హార్మూజ్ గుండా అంతర్జాతీయ నౌకల రాకపోకలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని ప్రకటించారు. కాగా, సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ దానిని అతిక్రమించింది. ఇరాన్, లెబనాన్‌పై మిసైల్ దాడులు చేసింది.
పాకిస్తాన్‌కు ప్రపంచ దేశాల అభినందన
ఇరాన్, అమెరికా మధ్య సీజ్‌ఫైర్ కుదుర్చడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా అభినందించాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్వాగతించారు. ఇది ప్రపంచానికి లభించిన ఉపశమనం అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ కృషితో కుదిరిన ఈ శాంతి ప్రక్రియను అభినందిస్తూ, ఇది శాశ్వత శాంతికి దారి తీయాలని జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ అన్నారు. పాకిస్తాన్ ధైర్యవంతమైన దౌత్యం నెరిపిందని మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం కొనియాడారు. పాలస్తీనాలో జరుగుతున్న మారణహోమాన్ని ఆపడానికి కూడా ఇదేస్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. సీజ్‌ఫైర్‌లో పాకిస్తాన్ పాత్రను సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్ ప్రశంసించాయి.
శాంతి చర్చలకు తాము ఎప్పుడూ మద్దతిస్తామని చైనా పేర్కొంది. అమెరికా దృఢ నిశ్చయం పనిచేసిందని, ఇదే తరహాలో రష్యాను కూడా యుద్ధం ఆపేలా ఒత్తిడి చేయాలని ఉక్రెయిన్ కోరింది. కాల్పుల విరమణను యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్వాగతించారు. కాగా, ఈ ఒప్పందాన్ని రాజకీయ విపత్తు అంటూ ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత యాయర్ లాపిడ్ విమర్శించారు. ఇజ్రాయెల్ భద్రతకు సంబంధించిన నిర్ణయాల్లో తమను భాగస్వాములను చేయలేదని నెతన్యాహు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రపంచానికి నిప్పు పెట్టిన వారు ఇప్పుడు బకెట్ నీళ్లతో వస్తే అభినందించలేమని, జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని మరచిపోలేమని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ వ్యాఖ్యానించారు.
ఇరాన్ 10 పాయింట్ల ప్లాన్ ఇదే..
- అమెరికా ఇకపై ఇరాన్‌పై ఎప్పటికీ దాడులు చేయబోమని అధికారికంగా, చట్టబద్ధంగా హామీ ఇవ్వాలి.
- ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పూర్తి నియంత్రణను కొనసాగిస్తుంది.
- ఇరాన్ తన సొంతంగా యురేనియంను శుద్ధి చేసుకునే హక్కును అమెరికా గుర్తించాలి. ఇది ఇరాన్ అణు కార్యక్రమానికి అత్యంత కీలకం.
- ఇరాన్‌పై ఉన్న ప్రైమరీ, సెకండరీ ఆర్థిక ఆంక్షలన్నింటినీ తక్షణమే తొలగించాలి. ఇతర దేశాలు ఇరాన్‌తో వ్యాపారం చేయకుండా అడ్డుకునే ఆంక్షలను ఎత్తేయాలి.
- యూఎన్ భద్రతా మండలి ఇరాన్‌కు వ్యతిరేకంగా జారీచేసిన తీర్మానాల రద్దు.
- అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఏఐఈఏ) ఇరాన్ అణు కార్యక్రమంపై పెట్టిన నిఘా, వ్యతిరేక తీర్మానాలను నిలిపివేయాలి.
- యుద్ధం వల్ల ఇరాన్ మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టానికి, పునర్నిర్మాణ పనులకు అమెరికా పరిహారం చెల్లించాలి.
- ప్రాంతీయ శాంతి కోసం మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న అమెరికా పోరాట బలగాలన్నింటినీ పూర్తిగా వెనక్కి తీసుకోవాలి.
- ఈ యుద్ధ విరమణ కేవలం ఇరాన్‌కే పరిమితం కాకుండా.. లెబనాన్, హెజ్బొల్లా ఉన్న అన్ని ప్రాంతాలకు వర్తించాలి.
- ఈ ఒప్పందాలన్నీ అంతర్జాతీయ చట్టం ప్రకారం అమలు కావాలంటే,
- యూఎన్ భద్రతా మండలి ఒక బైండింగ్ తీర్మానాన్ని ఆమోదించాలి.
ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు: మొజ్తబా
అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ స్పందించారు. ఈ కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు సంకేతం కాదని వ్యాఖ్యానించారు. సీజ్‌ఫైర్ ప్రకటన అనంతరం మొజ్తబా పేరుతో ఇరాన్ ఓ ప్రకటనను విడుదల చేయగా.. ఆ దేశ మీడియా చదివి వినిపించింది. ‘ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌మీదనే ఉన్నాయి. శత్రుదేశాలు ఏవిధంగానైనా దురాక్రమణకు పాల్పడితే.. పూర్తి బలంతో తిప్పికొడతాం” అని పేర్కొన్నారు. తక్షణమే కాల్పులు నిలిపివేయాలని అన్ని సైనిక విభాగాలను సుప్రీం నేత ఆదేశించినట్టు వెల్లడించారు.
