కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది : తీన్మార్ మల్లన్న

కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది : తీన్మార్ మల్లన్న
  • ‘బీసీ కాంట్రాక్టర్ల గర్జన’లో తీన్మార్ మల్లన్న

ముషీరాబాద్, వెలుగు:  ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. హక్కుల కోసం బీసీలు రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వ టెండర్లలో బీసీ కాంట్రాక్టర్లకు చట్టబద్ధంగా దక్కాల్సిన 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘బీసీ కాంట్రాక్టర్ల గర్జన’ పేరుతో బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. 

ఈ ధర్నాకు మల్లన్న హాజరై మద్దతు తెలిపారు. బీసీలు ఆర్థికంగా ఎదిగితే తమ ఆధిపత్యానికి గండు పడుతుందని కుట్రతోనే బీసీలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. బీసీల ఆత్మ గౌరాన్ని దెబ్బ తీస్తే సహించేది లేదని, తక్షణమే ప్రభుత్వ పనుల టెండర్లలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు వెనకబడిన వారు కాదని బీసీలు అంతా ఒకటైతే రాజకీయ సమీకరణలు మారిపోతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సుంకరి సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటి సాయికుమార్, భాస్కరరావు, గాజుల భాస్కర్, పట్నం శ్రీశైలం, హనుమాన్ సాగర్ పాల్గొన్నారు.