అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన 'బీఫ్' కామెంట్స్ అక్కడ పెను సంచలనంగా మారాయి. గిల్లికజ్జాలతో మొదలైన ఈ వివాదం.. గువహటి సెంట్రల్ నియోజకవర్గం కేంద్రంగా అసలైన ప్రచారాస్త్రంగా మారిపోయింది. తాను గోమాంసం వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కోరడం లేదని.. అయితే దానిని కేవలం ఇళ్లకే పరిమితం చేయాలని స్పష్టం చేశారు. ముస్లింలు బీఫ్ తినడాన్ని తాను అడ్డుకోవడం లేదని.. కానీ బహిరంగ ప్రదేశాల్లో మాత్రం వద్దు అనేది తన నినాదమని చెప్పటం వివాదాస్పదంగా మారింది. దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని సీఎం సార్ వెల్లడించారు. అయితే అక్కడ ఉన్న ముస్లీం మెజారిటీ ఓట్ల కోసమే సీఎం ఈ కామెంట్స్ చేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ముఖ్యంగా అసోం పశువుల సంరక్షణ చట్టం-2021 ప్రకారం.. దేవాలయాలు లేదా మఠాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో, అలాగే హిందువులు, సిక్కులు, జైనులు అధికంగా నివసించే ప్రాంతాల్లో గోమాంసం అమ్మకం, వినియోగంపై ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల వేళ, కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుంకి చౌదరి లక్ష్యంగా సీఎం శర్మ తీవ్ర విమర్శలు చేశారు. కుంకి చౌదరి తల్లిదండ్రులు బీఫ్ తింటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారని.. ఎన్నికల తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం రాజకీయంగా దుమారం రేపుతోంది.
సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. బీజేపీని తొలగించండి.. గోమాతను రక్షించండి అంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చారు. అటు కుంకి చౌదరి సైతం సీఎం ఆరోపణలను కొట్టిపారేశారు. తనపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ హిమంత బిశ్వ శర్మ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా అస్సామీ, నాన్-అస్సామీ గుర్తింపు చుట్టూ తిరుగుతున్న ఈ ఎన్నికల్లో.. బీఫ్ అంశం ఇప్పుడు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
ALSO READ : మొదటి భార్య ఉండగా.. ముస్లిం వ్యక్తి రెండో పెళ్లి చేసుకోవచ్చు
మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అసోంలో గురువారం పోలింగ్ జరగనుంది. ఒకవైపు బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ గుప్తాతో కుంకి చౌదరి పోటాపోటీగా తలపడుతుండగా, సీఎం చేసిన వ్యాఖ్యలు మతపరమైన, సాంస్కృతిక సెంటిమెంట్లను రగిలించాయి. మే 4వ తేదీన వెలువడే ఫలితాలే అసోం ప్రజల తీర్పు ఏంటో తేల్చిచెప్పనున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆహారపు అలవాట్లను వివాదాల్లోకి లాగడంపై సోషల్ మీడియాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య ఈ ఎన్నికల ఫలితాలు ఈశాన్య రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
