మొదటి భార్య జీవించి ఉండగానే ఒక ముస్లిం పురుషుడు రెండో వివాహం చేసుకోవడం, భారతీయ శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 494 ప్రకారం రెండో వివాహం (Bigamy) నేరం కిందకు రాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ (భర్త)పై అతని మొదటి భార్య ఫిర్యాదు మేరకు సెక్షన్లు 498-A (వేధింపులు), 494 (ద్వైవివాహం), 342, 323, 506 పార్ట్-II కింద కేసులు నమోదయ్యాయి. 20 ఏళ్ల వివాహ బంధం తర్వాత, తనకు పిల్లలు కలగలేదనే కారణంతో భర్త తనను వేధించాడని, కొట్టాడని ,రెండో పెళ్లి చేసుకుని తనను ఖులా (విడాకులు) ఇవ్వమని ఒత్తిడి చేశాడని భార్య ఆరోపించింది. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ భర్త హైకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ బి.పి. శర్మ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసు విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఒక పురుషుడు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు (నలుగురు భార్యల వరకు) చేసుకోవడానికి అనుమతి ఉంది. సెక్షన్ 494 ప్రకారం ఒక వివాహం నేరం కావాలంటే, మొదటి భార్య ఉండగానే చేసుకున్న రెండో పెళ్లి చట్టరీత్యా 'చెల్లనిది' (Void) కావాలి. అయితే ముస్లిం చట్టం ప్రకారం రెండో పెళ్లి చెల్లుతుంది కాబట్టి అది బిగమీ నేరం కిందకు రాదని బెంచ్ వ్యాఖ్యానించింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం నిబంధనలకు లోబడి ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఈ కేసులో సెక్షన్ 494 కింద ఉన్న ప్రాథమిక నిబంధనలు వర్తించవు అని కోర్టు పేర్కొంది.
మిగతా కేసులు కొనసాగుతాయి: హైకోర్టు
అయితే భార్యపై వేధింపులు (498-A), కొట్టడం (323), బెదిరింపులు (506) వంటి ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఆ సెక్షన్ల కింద ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు జస్టిస్ బీపీ శర్మ.
