వెలుగు ఓపెన్ పేజీ.. నిరసన బాటపట్టిన ఉపాధ్యాయులు! ..పరిష్కారం లభించేదెప్పుడు?

వెలుగు ఓపెన్ పేజీ.. నిరసన బాటపట్టిన  ఉపాధ్యాయులు! ..పరిష్కారం లభించేదెప్పుడు?

తెలంగాణ  రాష్ట్రంలోని 33 జిల్లాలలో  ఉన్న ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టారు.  పదవ తరగతి  వార్షిక  పరీక్షల పేపర్ల  వాల్యుయేషన్  క్యాంపు ( స్పాట్)లలో  అన్ని ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యంగా తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీటీజేఏసీ), యుఎస్​పీసీ,  జాక్టో  సంయుక్త ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.  

2024-–25  విద్యా సంవత్సరంలో నిర్వహించిన  స్పాట్ డబ్బులను ఇంతవరకు ఇవ్వలేదని  2025-–2026  రెండో దఫా  స్పాట్ వాల్యుయేషన్  డబ్బులు  చివరిరోజు  ఇచ్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు.  పాత రేట్లు కాకుండా ప్రతిరోజూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా స్పాట్ వాల్యుయేషన్  డబ్బులను 50 శాతం పెంచాలని  కోరుతున్నారు.  

గతంలో  నిర్వహించిన  జనాభా  లెక్కల విధులు నిర్వహించిన వారికి ఇంతవరకు డబ్బులు రాలేదని వెంటనే చెల్లించాలని కోరారు.  తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్పాట్ వాల్యుయేషన్  క్యాంపులలో  మధ్యాహ్నం  ఒంటిగంట నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శాంతియుత మార్గంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పరిష్కారం లభించేదెప్పుడు?

తెలంగాణ  రాష్ట్రంలోని ఉపాధ్యాయులు  అనేక  సమస్యలతో  ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, 317 జీ.వో  బాధితులను  సొంత జిల్లాలకు పంపాలని,   స్థాని కులు,  స్థానికేతరులుగా మారాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   భాషోపాధ్యాయులకు ఆర్డినెన్సు రద్దు చేసి ఉద్యోగంలో   చేరినప్పటి  నుంచి  స్కూల్ అసిస్టెంట్ గా పరిగణించాలని, భాషోపాధ్యాయులు ఉన్నత  పాఠశాలల్లో  విధులు  నిర్వహించి ప్రాథమిక  పాఠశాల  వేతనాలు తీసుకొని వెట్టిచాకిరికి,  శ్రమదోపిడీకి  గురయ్యారని  ఆందోళన  వ్యక్తం  చేస్తున్నారు. 

 ప్రాథమిక పాఠశాలల్లో  పనిచేస్తున్న  ఎస్జీటీ ఉపాధ్యాయులకు  మూడు  దశాబ్దాలు గడిచినా  పదోన్నతులు లేవు.  ఎస్జీటీ ఉపాధ్యాయులు అనేకమంది ఉన్నత చదువులు చదివినా ప్రయోజనం లేకుండా పోతుంది.  నగదు రహిత  హెల్త్ కార్డుల కోసం డబ్బులు కట్టడానికి  ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒప్పుకున్నా  పెండింగ్​లో   పెట్టడంలో  ఆంతర్యమేమిటో  అర్థం కావడం  లేదు.  నగదు రహిత హెల్త్ కార్డుల విషయం మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనకకు పోతుంది. పెండింగ్​లో ఉన్న 5 డి.ఏలను  ఇవ్వాలని  పీఆర్సీ  గడువు ముగిసినప్పటికీ  దాని  ప్రస్తావన  తేవడం లేదని  రెండో పీఆర్సీ వెంటనే  ప్రకటించాలని  ఉపాధ్యాయులు  కోరుతున్నారు. 

సీనియర్ ఉపాధ్యాయులకు  టెట్ ను మినహాయించాలి

డైట్ కళాశాలల్లో,  బి.ఎడ్ కళాశాలల్లో,  ఐసిఎస్ఈ, ఎస్సీఈఆర్టీఈ (తెలంగాణ రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ సంస్థలలో  ఖాళీగా ఉన్న  సీనియర్  లెక్చరర్ పోస్టులు,  అసిస్టెంట్  ప్రొఫెసర్,  అసోసియేట్  ప్రొఫెసర్  పోస్టులను  భర్తీచేసి  తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలో నాణ్యమైన విద్య అందించాలి.  టెట్ నుంచి  సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని హైకోర్టు  ఉత్తర్వులు ఇచ్చినా, అన్ని ఉపాధ్యాయ సంఘాలు టెట్ నుంచి  సీనియర్ ఉపాధ్యాయులకు  మినహాయింపు  ఇవ్వాలని  కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా  కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు.  దీంతో ఉద్యమాలే  శరణ్యం అంటూ ఉపాధ్యాయులు ఏకమై సంఘాలకతీతంగా అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టారు. 

- డా. ఎస్. విజయ భాస్కర్, 
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.