హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏడాది వయస్సున్న బాబు కిడ్నీలో10 మిల్లీమీటర్ల రాయిని గుర్తించిన ఏఐఎన్‌యూ డాక్టర్లు ఎలాంటి ఆపరేషన్ లేకుండానే తొలగించారు. కర్నాటకలోని బీదర్ కు చెందిన ఏడాది వయస్సున్న బాలుడికి మూత్రంలో రక్తం రావడంతో బంజారాహిల్స్‌లోని ఏఐఎన్‌యూకి తీసుకువచ్చారు. యూరాలజిస్ట్ డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ నేతృత్వంలోని టీమ్లిథోట్రిప్టర్ మెషీన్‌తో హై ఎనర్జీ షాక్ వేవ్స్ ఇచ్చి (ఈసీడబ్లూఎల్ ) విజయవంతంగా రాయిని పిండి చేసి తీసేశారు.
దీనిపై డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ మాట్లాడుతూ చికిత్స చేసిన కొద్ది గంటల్లోనే బాలుడు తల్లి పాలు తాగడంతో డిశ్చార్జి చేశామన్నారు. ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహార అలవాట్లతోనే చిన్నారుల్లో కూడా కిడ్నీ స్టోన్స్ పెరుగుతున్నాయని ఏఐఎన్‌యూ ఎండీ, రోబోటిక్ సర్జన్ డాక్టర్ సి. మల్లికార్జున్ తెలిపారు.
ఇలాంటి సందర్భాల్లో చిన్నపిల్లల్లో ఎండోస్కోపీ, లేజర్ వంటి పద్ధతులు వారి శరీరానికి ఇబ్బంది కలిగిస్తాయన్నారు. డాక్టర్ పూర్ణచంద్ర రెడ్డి, డాక్టర్ మల్లికార్జున సి, దేశ్‌పాండ్యా, హేమేష్‌లు ఈ ట్రీట్ మెంట్ చేసినట్లు పేర్కొన్నారు.
